Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రత
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:25 AM
అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంత్రుల పీఏలకు అనుమతి లేదు
సీఎంను కలిసేవారు సీఎంవోకే వెళ్లాలి: అయన్న
శాసనసభ స్పీకర్ అయ్యన్న ఆదేశాలు
20 రోజులపాటు బడ్జెట్ సెషన్!?
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సోమవారం సభలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని, సభ్యులందరూ 9.30 గంటలకు హాజరు అవుతారని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు(పీఏ) పాసులు ఇవ్వడం లేదని చెప్పారు. దీంతో వారికి సభా ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదని, సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చేవారు, ఇతర ప్రతినిధులను కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించబోమన్నారు. ఈ నేపథ్యంలో సీఎంను కలుసుకునేవారు ముఖ్యమంత్రి కార్యాలయానికే వెళ్లాలని సూచించారు. శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలీసు అధికారులకు అందరూ సహకరించాలని కోరారు. సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్, కొత్తగా నిర్మిస్తున్న క్యాంటిన్‌ను స్పీకర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర తదితరులు పాల్గొన్నారు.