10th results: ‘పది’లో 14వ స్థానం
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:25 AM
State/School Ranking పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయిలో 14వ స్థానం లభించింది. ఎప్పటిలానే ఈ సారీ బాలురు కన్నా బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 28,176 మంది విద్యార్థులు హాజరయ్యారు.
23,219 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
ఈసారీ బాలికలదే పైచేయి
ఓపెన్ టెన్త్‌లో 19 శాతమే పాస్
ఓపెన్ ఇంటర్‌లో 18వ స్థానం
శ్రీకాకుళం/ హరిపురం/ టెక్కలి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయిలో 14వ స్థానం లభించింది. ఎప్పటిలానే ఈ సారీ బాలురు కన్నా బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 28,176 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 14,287 మంది బాలురు, 13,889 మంది బాలికలు ఉన్నారు. బుధవారం ఫలితాలు విడుదల కాగా.. జిల్లాలో 23,219 మంది ఉత్తీర్ణత సాధించారు. 11,358 మంది(79.50 శాతం) బాలురు, 11,861 మంది(85.40 శాతం) బాలికలు పాసయ్యారు. మొత్తం 82.41 శాతం ఉత్తీర్ణత లభించింది. జిల్లాలో 19,114 మంది విద్యార్థులు ప్రథమశ్రేణి(ఫస్ట్ క్లాస్)లో పాసయ్యారు. 2,885 మంది సెకెండ్ క్లాస్‌లోనూ, 1,220 మంది థర్డ్ క్లాస్‌లో పాసయ్యారు.
ఓపెన్ టెన్త్‌లో కేవలం 9.46 శాతమే పాస్...
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(ఏపీఓఎస్‌ఎస్) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో జిల్లా వెనుకంజలో నిలిచింది. ఓపెన్ టెన్త్ విషయానికొస్తే.. కేవలం 9.46 శాతం మాత్రమే ఉత్తీర్ణత లభించింది. 708 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 67 మంది మాత్రమే పాసయ్యారు. 286 మంది బాలురు పరీక్ష రాయగా 25 మంది ఉత్తీర్ణులయ్యారు. 422 మంది బాలికలు పరీక్ష రాయగా 42 మంది మాత్రమే పాసయ్యారు. ఎక్కువ మంది విద్యార్థులు హిందీ, గణితం, సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షలలో తప్పారు. రాష్ట్రస్థాయిలో ఓపెన్ టెన్త్‌లో జిల్లాకు 19వ స్థానం దక్కింది.
ఓపెన్ ఇంటర్‌లో 35.57 శాతం ఉత్తీర్ణత...
ఓపెన్ ఇంటర్‌లో 35.57 శాతం ఉత్తీర్ణత లభించింది. 727 మంది బాలురు, 701 మంది బాలికలు.. మొత్తం 1,428 పరీక్ష రాశారు. ఇందులో 213 మంది బాలురు, 295 మంది బాలికలు.. మొత్తం 508 మంది పాసయ్యారు. బాలురుల్లో 29.30 శాతం ఉత్తీర్ణత, బాలికల్లో 42.08 శాతం ఉత్తీర్ణత లభించింది. రాష్ట్రస్థాయిలో ఓపెన్ ఇంటర్‌మీడియట్‌లో 18వ స్థానం దక్కింది.
జ్యోషిత.. ఘనత
మందస మండలం మఖరజోల గ్రామానికి చెందిన కంచరాన జ్యోషిత పదోతరగతిలో 597 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు కంచరాన మాధవరావు పెద్దకేసుపురం పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు కాగా, తల్లి లేపాక్షి సోంపేట మండలం తాళ్లపద్రలో ఎస్‌జీటీ ఉపాధ్యాయరాలు. ప్రభుత్వ పాఠశాలలపై మక్కువతో తమ కుమార్తె జ్యోషితను హరిపురం హైస్కూల్‌లో చదివించామని తల్లిదండ్రులు తెలిపారు. హరిపురం పాఠశాల హెచ్‌ఎం ఉమారాజ్‌తోపాటు మఖరజోల గ్రామస్థులు జ్యోషితకు అభినందనలు తెలియజేశారు.
ఆటోడ్రైవర్ కుమారుడి ప్రతిభ
పాలతలగాం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ జగదీష్ కుమారుడు సనపల తేజ పదోతరగతిలో 595 మార్కులతో ప్రతిభ చూపాడు. దీంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. గ్రామస్థులు అభినందనలు తెలిపారు. అలాగే బీంపురం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు.