Share News

Secretariats: ఇక సర్దుబాటు!

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:07 PM

Surplus Staff రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల సమూల ప్రక్షాళనకు చర్యలు చేపడుతోంది. సచివాలయ ఉద్యోగులను పూర్తిగా ప్రజోపయోగ పనులకు వినియోగించాలని భావిస్తోంది. అందుకే ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేపట్టింది. గ్రామ/వార్డు సచివాలయాలను ఏ,బీ,సీ విభాగాలుగా విభజించి.. జనాభా ప్రాతిపదికన ఉద్యోగులను నియమించనుంది.

Secretariats: ఇక సర్దుబాటు!
కొళిగాం సచివాలయం

  • సచివాలయాల్లో మిగులు సిబ్బంది 1,534 మంది

  • హేతుబద్ధీకరణలో తేలిన లెక్క

  • జనాభా ప్రాతిపదికన సేవలు

  • ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురుచూపు

  • ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల సమూల ప్రక్షాళనకు చర్యలు చేపడుతోంది. సచివాలయ ఉద్యోగులను పూర్తిగా ప్రజోపయోగ పనులకు వినియోగించాలని భావిస్తోంది. అందుకే ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేపట్టింది. గ్రామ/వార్డు సచివాలయాలను ఏ,బీ,సీ విభాగాలుగా విభజించి.. జనాభా ప్రాతిపదికన ఉద్యోగులను నియమించనుంది. హేతుబద్ధీకరణ తరువాత జిల్లాలో మిగులు ఉద్యోగులుగా 1,534 మందిని గుర్తించింది. వీరిని వివిధ శాఖలకు కేటాయించనుంది.

  • 2019 అక్టోబరు 2న వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 732 గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ప్రజలకు స్థానికంగా సేవలందించే పేరిట ప్రతి సచివాలయంలో 11శాఖలకు సంబంధించి సహాయకులను నియమించింది. జిల్లా బోర్డు ఆధ్వర్యంలో మొత్తంగా 6,476 మంది ఉద్యోగుల నియామకాలు చేపట్టింది. కాగా కొన్నిచోట్ల సిబ్బంది ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. దీంతో కొందరికి పని తక్కువగా ఉండగా.. మరికొందరిపై విపరీతంగా భారం పడుతోంది. ధ్రువపత్రాల జారీలో డిజిటల్‌, వెల్ఫేర్‌ కార్యదర్శులు కీలకంగా వ్యవహరిస్తారు. వీరి సంఖ్య తక్కువగా ఉంది. పలుచోట్ల సాంకేతిక సహాయకులు లేకపోవడంతో ఆ పనిని వెల్ఫేర్‌ అసిస్టెంట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల చాలా శాఖలకు సంబంధించి కార్యదర్శులకు పనిలేకుండా పోతోంది. ఉదాహరణకు మత్స్యకారులు లేని సచివాలయాల్లో మత్స్యశాఖకు సంబంధించి కార్యదర్శులను నియమించారు. వారికి ఎటువంటి పనిలేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను హేతుబద్ధీకరణ చేసింది. ఉద్యోగుల్లో చాలామంది ఇంజనీరింగ్‌, డిప్లమో, పీజీ, పీహెచ్‌డీ చేసిన వారు ఉన్నారు. వీరి సేవలను క్షేత్రస్థాయిలో మెరుగ్గా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సచివాలయ ఉద్యోగుల సీఎంఎఫ్‌ఎస్‌ ఐడీ, సెల్‌ఫోన్‌ నంబరు, విద్యార్హత, కులం, ఉపకులం వివరాలు సేకరించింది. బీటెక్‌, ఎంటెక్‌, ఈసీఈ, మెకానికల్‌, సివిల్‌, పీజీ, పీహెచ్‌డీ చేసిన వారి సమాచారం తీసుకుంది. ఇప్పుడు ఉద్యోగుల రేషన్‌లైజేషన్‌లో ప్రజా అవసరాల మేరకు వీరి సేవలను వినియోగించనుంది.

  • ఏబీసీలుగా విభజన..

  • సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు సంబంధించి ఏ,బీ,సీ విభాగాలుగా రూపొందించారు. మల్టీపర్సస్‌, టెక్నికల్‌, ఆస్పిరేషనల్‌ ఫంక్షనరీలుగా విభజించారు. వాటి ఆధారంగా ఉద్యోగులను సర్దుబాటు చేస్తారు. ఆస్పిరేషనల్‌ ఫంక్షనరీలు క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. ఏ- కేటగిరికి సంబంధించి 2,500 మంది జనాభాలోపు ఉన్న సచివాలయాల్లో ఇద్దరు మల్టీపర్పస్‌ ఫంక్షనరీలు, నలుగురు టెక్నికల్‌ ఆస్పరేషనల్‌ ఫంక్షనరీలు ఉంటారు. బీ- సెక్షన్‌కు సంబంధించి 2,500 నుంచి 3000 జనాభా ఉన్న సచివాలయాలకు ముగ్గురు మల్టీపర్పస్‌, నలుగురు టెక్నికల్‌ ఫంక్షనరీలు ఉంటారు. సి- సెక్షన్‌కు సంబంధించి 3వేలకుపైగా జనాభా ఉన్న సచివాలయాల్లో నలుగురు మల్టీపర్పస్‌, నలుగురు టెక్నికల్‌ ఫంక్షనరీలు ఉంటారు. అలాగే ప్రభుత్వం ఇటీవల డ్రోన్లతో పాటు ఆర్డిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, జియో ట్యాగింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. వాటి బాధ్యతలను సైతం అప్పగించే చాన్స్‌ ఉంది. హేతుబద్ధీకరణ నేపథ్యంలో సుమారు 4,942 మంది ఉద్యోగులను సచివాలయాలకే కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన 1534 మందిని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ శాఖలకు కేటాయిస్తారు.

  • గ్రామ సచివాలయాల్లో మల్టీపర్పస్‌ ఫంక్షనరీల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌, ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్స్‌తోపాటు మహిళా పోలీసులు ఉంటారు. వార్డు సచివాలయానికి సంబంధించి అడ్మిన్‌ కార్యదర్శి, ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, వెల్ఫేర్‌, డెవలప్‌మెంట్‌ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి ఉంటారు.

  • గ్రామ సచివాలయాల్లో టెక్నికల్‌ ఫంక్షనరీలకు సంబంధించి వీఆర్వో, ఏఎన్‌ఎం, సర్వేయర్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వ్యవసాయం, పశుసంవర్థక ఎనర్జీ కార్యదర్శి ఉంటారు. వార్డు సచివాలయాల్లో రెవెన్యూ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ప్లానింగ్‌ కార్యదర్శి, ఎమినిటీస్‌, శానిటరీ, ఎనర్జీ కార్యదర్శులు ఉంటారు.

  • పని సర్దుబాటు కోసమే..

    సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియ వాస్తవమే. ప్రభుత్వం మూడు విభాగాలు విభజించింది. ఆ మేరకు ఉద్యోగులను సర్దుబాటు చేస్తుంది. సేవలు సరళతరం, ఉద్యోగులపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

    - ఉదయ్‌కుమార్‌, సచివాలయాల శాఖ జిల్లా అధికారి, శ్రీకాకుళం

Updated Date - Apr 24 , 2025 | 11:07 PM