పాడి రైతులకు భరోసా
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:01 AM
పాడి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశువులకు బీమా ప్రీమియంలో రైతుల వాటాను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాజాం రూరల్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి)
పాడి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశువులకు బీమా ప్రీమియంలో రైతుల వాటాను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా కారణాలతో పశువులు, గొర్రెలు, మేకలు మృతి చెందితే బీమా సొమ్ము రైతులకు అందేలా కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. పాడి రైతులకు అండగా ఉండేందుకు వీలుగా పశు బీమా పథకంలో పలు మార్పులు తీసుకువచ్చింది.
ఫ జిల్లాలో మొత్తం 119 పశువైద్య శాలలు ఉన్నాయి. ఆవులు, గేదెల సంఖ్య 4.76 లక్షలు ఉండగా.. మేకలు, గొర్రెలు సంఖ్య 6.32 లక్షలు ఉంది. పందులు 2.43 లక్షలు ఉన్నాయి.
నూతన మార్గదర్శకాలివిగో..
ఫ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాడి రైతు గరిష్ఠంగా ఐదు పశువులకు మాత్రమే బీమా చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం గరిష్ఠంగా పది పశువులకు బీమా చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఫ గతంలో గొర్రెలు, మేకలకు సంబంధించి 50కి మాత్రమే బీమా సౌకర్యం ఉండగా నేడు ఆ సంఖ్య 100కి పెంచింది.
ఫ గతంలో రైతు వాటా ప్రీమియం 20 శాతం ఉండగా.. కూటమి ప్రభుత్వం 15 శాతానికి తగ్గించింది.
ఫ గత ప్రభుత్వ హయాంలో బీమా ప్రీమియం చెల్లించినా మృతి చెందిన పశువులకు సకాలంలో నష్టపరిహారం అందేది కాదు. దీంతో చాలామంది రైతులు బీమా చేయించేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో బకాయిలను సైతం రైతులకు పంపిణీ చేసే ఏర్పాట్లు చేసింది.
ఫ ఆవు, పాడిగేదె విలువ రూ.30 వేలుగా నిర్ధారించి మూడేళ్ల ప్రీమియం రూ.1920గా నిర్ణయించింది. ఇందులో రైతు వాటాగా రూ.288 చెల్లిస్తే మూడేళ్లపాటు బీమా పథథం అమల్లో ఉంటుంది.
ఫ నాటు జాతి పశువు విలువ రూ.15 వేలుగా నిర్ధారించింది. మూడేళ్ల ప్రీమియం రూ.960 కాగా రైతువాటా రూ.144 చెల్లిస్తే సరిపోతుంది.
ఫ గొర్రె, మేక, పంది ఒక్కోదానికి ఏడాదికి పెంపకందారు వాటాగా రూ.27, రెండేళ్లకు రూ40, మూడేళ్లకు రూ.56 చెల్లించాలి. ఒక్కొక్కరు గరిష్ఠంగా వంద వరకు బీమా చేయించుకోవచ్చు.
ఫ బీమా కావాలనుకునే రైతులు బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు.. ఎస్సీ, ఎస్టీలైతే రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేయాలి. పశువులు మృతిచెందిన వెంటనే సమీపంలోని రైతు సేవ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. బీమా సర్వే సిబ్బంది వచ్చే వరకు పశువులకు వేసిన ట్యాగ్‌ను తొలగించకుండా ఉండాలి. బీమా చేసిన పశువులను విక్రయిస్తే ఏడు రోజుల్లోగా కంపెనీ వారికి తెలియజేసి కొనుగోలుదారుడి పేరుపైన మార్చాలి. ఈ నిబంధనలపై సంబంధిత అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోండి..
పాడి రైతులు, గొర్రెల పెంపకందారులు పశుబీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం తగ్గింపుతో పాటు మరిన్ని అదనపు వెసులుబాట్లు కల్పించింది. రైతులు అందుబాటులో ఉన్న పశువైద్యుల్ని సంప్రదించాలి. ఒకసారి బీమా చేస్తే మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
-డా.జయప్రకాశ్, అసిస్టెంట్ డైరెక్టర్, పశుసంవర్థకశాఖ