central minister: కేంద్రమంత్రికి మరో గుర్తింపు
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:44 PM
Central Minister Recognition కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుకి మరో అరుదైన గుర్తింపు లభించింది. వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ యంగ్ లీడర్ జాబితా- 2025లో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పేరును వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేర్చింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో రామ్మోహన్‌నాయుడు పేరు
శ్రీకాకుళం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుకి మరో అరుదైన గుర్తింపు లభించింది. వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ యంగ్ లీడర్ జాబితా- 2025లో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పేరును వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేర్చింది. ఈ జాబితాలో టెక్ వ్యవస్థాపకుల నుంచి మానవ హక్కులు.., న్యాయవాదుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులు ఉన్నారు. భారతదేశం నుంచి మొత్తం ఏడుగురికి ఎంపిక చేయగా.. అందులో జిల్లాకు చెందిన రామ్మోహన్‌నాయుడు ఉండడం గర్వకారణం.
26 ఏళ్లకే ఎంపీగా..
2014లో అతి చిన్నవయసులో 26 ఏళ్లకే పార్లమెంట్ సభ్యుడిగా రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లోనూ వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. ప్రధాని నరేంద్రమోదీ మంత్రివర్గంలో అతి చిన్న వయసులో కేబినేట్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన నాయకత్వంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త శక్తిని పొందింది. విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడానికి ఆయన కృషి చేశారు. ఉడాన్ కనెక్టివిటీని మారుమూల ప్రాంతాలకు విస్తరించడానికి, డిజిటల్ ఆవిష్కరణలతో భారతదేశ విమానయాన పరిశ్రమను భవిష్యత్తుకు తీసుకువెళ్లడానికి సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రపంచ గుర్తింపు కలిగిన భారతీయులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలెట్, ఇటీవల రితేష్ అగర్వాల్‌తోపాటు ఆ జాబితాలో రామ్మోహన్‌నాయుడు కూడా చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు స్పందిస్తూ.. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు నా ఒక్కడిదే కాదు. ముఖ్యమైన, ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతుందని ఇది సూచిస్తోంది. నిజాయితీ, నూతన ఆలోచనలు, సమగ్రతతో ప్రజలకు సేవ చేయాలనే బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది’ అని తెలిపారు.