Share News

కొబ్బరి పరిశ్రమ వెలవెల

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:24 PM

Coconut industry : కంచిలి మండల కేంద్రంగా ఒకప్పుడు కళకళలాడిన కొబ్బరి పుల్లల పరిశ్రమ ఇప్పుడు వెలవెలబోతుంది.

కొబ్బరి పరిశ్రమ వెలవెల
ఎగుమతి చేసేందుకు కొబ్బరి పుల్లల కట్టలను సిద్ధం చేసిన దృశ్యం

- పుల్లల వ్యాపారంపై ఇండోనేషియా ప్రభావం

-ధర ఉన్నా నాణ్యత లేమి

- మూతపడుతున్న బడ్డీలు

- వలసబాట పడుతున్న కార్మికులు

- ఉపాధి పథకం అనుసంధానం చేయాలని ప్రభుత్వానికి విన్నపం

కంచిలి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కంచిలి మండల కేంద్రంగా ఒకప్పుడు కళకళలాడిన కొబ్బరి పుల్లల పరిశ్రమ ఇప్పుడు వెలవెలబోతుంది. ఒకవైపు ఆధునీకరణ, మరోవైపు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న కొబ్బరి అనుబంధ పరిశ్రమల వస్తువుల ప్రభావంతో కంచిలిలో కొబ్బరి పుల్లల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. కూలి ఖర్చులు అధికంగా ఉండడం, పుల్లల్లో నాణ్యత లోపించడం నష్టాలకు కారణమతోంది. ఫలితంగా కొబ్బరి పుల్లల బడ్డీలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఆధారపడిన కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఇటువంటి పనులకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేస్తే తమకు ఎంతో మేలు కలుగుతుందని కార్మికులు అంటున్నారు.

ఇదీ పరిస్థితి..

కొబ్బరి పరిశ్రమకు ఉద్దానం పెట్టింది పేరు. ముఖ్యంగా కంచిలి కొబ్బరి మార్కెట్‌ నుంచి ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు కొబ్బరి కాయలను ఎగుమతి చేసేవారు. దీనికి అనుబంధంగా కొబ్బరి పీచు, పుల్లల వ్యాపారాన్ని నిర్వహించేవారు. దీంతో వందలాది బడ్డీలు రాత్రింబవళ్లు కార్మికులతో కళకళలాడేవి. సుమారు ఐదు దశాబ్దాల కిందట బయట రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యాపార కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకుని కొబ్బరి మార్కెట్‌పై గుత్తాధిపత్యాన్ని సాధించారు. వీరి ఆధీనంలోనే ఉద్దానం కొబ్బరి వ్యాపారమంతా జరుగుతుండేది. కొబ్బరి కాయల విక్రయాలే కాకుండా కొబ్బరి అనుబంధ వస్తువుల ఎగుమతులను ప్రారంభించడంతో కార్మికులకు అదనపు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా యంత్రాలు అవసరం లేని, కొబ్బరి పుల్లల వ్యాపారం స్థానికంగా ఉన్న మహిళలు, వృద్ధులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చింది. దీంతో వందలాది కుటుంబాలకు మేలు జరగడమే కాకుండా కొబ్బరి పుల్లల వ్యాపారం చేసే బడ్డీలు అధికమయ్యాయి. ఉద్దానంలో లభించే కొబ్బరి పుల్లలను 95 శాతం వరకు ఇళ్లల్లో శుభ్ర పరిచే చీపుర్లగా ఉపయోగిస్తుంటారు. కొన్ని చోట్ల అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో పుష్పాలంకరణల్లో వినియోగిస్తుంటారు. దీంతో నిత్యం పదుల సంఖ్యలో లారీలతో కొబ్బరి పుల్లలను కంచిలి మార్కెట్‌ నుంచి ఇతర ప్రాంతాలకు పంపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెలకి ఒకటి, రెండు లారీల సరుకు పంపించడమే కష్టంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు.


ఇండోనేషియా ప్రభావం..

హుద్‌హుద్‌, తిత్లీ తుఫాన్‌ల తరువాత ఉద్దానం కొబ్బరి పంట తీరని నష్టాలకు గురైంది. తెగుళ్లు, చీడపీడల కారణంగా కొబ్బరి కాయల పరిమాణం తగ్గింది. కొబ్బరి చెట్ల కొమ్మలు పచ్చదనాన్ని కోల్పోయి, పుల్లల్లో సైతం నాణ్యత లోపించింది. ఈ ప్రభావం కొబ్బరి పుల్లల వ్యాపారంపై తీవ్రంగా పడింది. గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా ఇండోనేషియా నుంచి దిగుమతి అవుతున్న కొబ్బరి కాయలు, పుల్లల కారణంగా ఇక్కడి మార్కెట్‌ నాశనమైంది. ఇండోనేషియా కొబ్బరి పుల్లలు నాణ్యతతో పాటు ధర తక్కువగా ఉండడంతో ఇతర రాష్ర్టాల వ్యాపారులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో కంచిలి మార్కెట్‌ పూర్తిగా మసకబారింది.


ధర ఉన్నా.. నాణ్యత లేమి..

ఉద్దానం కొబ్బరి పుల్లలకు బహిరంగ మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ నాణ్యత లోపించడంతో వాటికి తగిన ఆదరణ లభించడం లేదు. గతంలో నాణ్యమైన పచ్చి కొబ్బరి పుల్లలను కిలో రూ.10 నుంచి రూ.15కు కొనుగోలు చేయగా, ప్రస్తుతం రూ.52 నుంచి రూ.55కు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఎండిన కొబ్బరి పుల్లలైతే కిలో రూ.33 నుంచి రూ.35కు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ధర ఉన్నా నాణ్యత లేకపోవడంతో పుల్లలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొబ్బరి పుల్లల బడ్జీలు మూతపడుతున్నా యి. గతంలో సుమారుగా 30 నుంచి 40 బడ్డీలు ఉన్న కంచిలిలో ప్రస్తుతం 4 నుంచి ఐదు మాత్రమే ఉన్నాయి. కేవలం పుల్లల బడ్డీలు మూతపడటమే కాకుండా ఇళ్ల వద్ద కొబ్బరి పుల్లలు సేకరించే మహిళలు, వృద్ధులు సైతం అమ్మకాలు సాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మధ్య, చిన్న కుటుంబాలు జీవనోపాధి కోసం బయట ప్రాంతాలకు వలస పోతున్నాయి.


మరింత చేయూత అవసరం..

ఉద్దానంలో నాశనమైన కొబ్బరి పంట అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందిస్తున్నప్పటికీ అది ఇంకా పూర్తిస్థాయిలో అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం కొబ్బరి తోటల్లో కందకాల తవ్వకాలకు సంబంధించిన పనులను ప్రభుత్వం ఉపాధి పథకానికి అనుసంధానం చేయడంతో పెద్ద రైతులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. తోటల్లో కొబ్బరి కొమ్మలు కోయడం, కొమ్మల నుంచి పుల్లలు సేకరించడం, వాటిని ఎగుమతులకు సిద్ధం చేయడం వంటి పనులు చాలా కష్టంతో కూడుకున్నవి. రోజంతా పని చేసే కూలీలకు వేతనం సరిపగా లేకపోవడంతో ఈ పనులకు కూలీలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇటువంటి పనులకు సైతం ఉపాధి పథకం అనుసంధానం చేస్తే రైతులకు ఎంతో మేలు జరగడమే కాకుండా కొబ్బరి కార్మికులకు ఆదాయం పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

11-kcl-p-7a.gifకొబ్బరి పుల్లలను ఎండ బెడుతున్న దృశ్యం


కూలి గిట్టుబాటు కావడం లేదు

రోజంతా కొబ్బరి బడ్డీల్లో పని చేస్తే కూలి గిట్టుబాటు కావడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 15 నుంచి 20 కిలోల పుల్లలను మాత్రమే సిద్ధం చేయగలుగుతున్నాం. ఏ పనులు లేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వస్తుంది. ఇళ్ల వద్ద చేస్తామంటే పనులు లేవు.

-లచ్చమ్మ, కూలీ, పద్మతుల

ఇండోనేషియా ప్రభావం ఎక్కువగా ఉంది

గతంలో కంచిలి మార్కెట్‌ నుంచి ఎగుమతి చేసే కొబ్బరి కాయలు, పుల్లలకు ఎంతో డిమాండ్‌ ఉండేది. కానీ ఇప్పుడు ఇండోనేషియా నుంచి వస్తున్న కొబ్బరి పుల్లలకు ఇతర రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ కూలి ఖర్చులు అధికంగా ఉండటమే కాకుండా, పుల్లల్లో నాణ్యత లోపించడం మార్కెట్‌ నష్టాలకు కారణమతోంది. 40 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు మాత్రం నిర్వహణ చాలా కష్టంగా ఉంది.

-సంజయ్‌ కుమార్‌ శర్మ (టిల్లు) కొబ్బరి వ్యాపారి, కంచిలి

ఉపాధి పథకం వర్తింపజేయాలి

కొబ్బరి పంట అభివృద్ధికి సాయం చేస్తున్న ప్రభుత్వం కొబ్బరి అనుబంధ వస్తువుల సేకరణకు కూడా పథకం వర్తింప చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా కొబ్బరి కొమ్మలు సేకరించడం, పుల్లలు సిద్ధం చేసే పనులకు ఉపాధి పథకం వర్తింపచేయాలి.

-రాకేష్‌ అత్‌ఘర్‌, కొబ్బరి వ్యాపారి, కంచిలి

Updated Date - Apr 16 , 2025 | 11:24 PM