Cm birthday: గొప్ప దార్శనికుడు చంద్రబాబు
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:09 AM
Visionary Leader ‘నవ్యాంధ్ర నిర్మాత.. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత.. గొప్ప దార్శనికుడు సీఎం చంద్రబాబునాయుడు’ అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కొనియాడారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.
నవ్యాంధ్ర నిర్మాత.. అభివృద్ధి ప్రదాత సీఎం
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
ఘనంగా టీడీపీ అధినేత జన్మదినం
అరసవల్లి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి)ః ‘నవ్యాంధ్ర నిర్మాత.. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత.. గొప్ప దార్శనికుడు సీఎం చంద్రబాబునాయుడు’ అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కొనియాడారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కలమట వెంకటరమణతో కలిసి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కేక్ కట్ చేశారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఏడురోడ్ల జంక్షన్ వద్ద ఎన్టీఆర్, ఎరన్నాయుడు విగ్రహాలకు నివాళి అర్పించారు. ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘రాష్ట్ర భవిష్యత్తుకు దిశ, దశ నిర్దేశించే వ్యక్తి చంద్రబాబునాయుడు మాత్రమే. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన ఆయన నేటికీ నిత్య విద్యార్థి. ఆయన నేర్చుకుంటూ, అందరూ నేర్చుకునేలా తీర్చిదిద్దుతారు. ఆయన మార్గనిర్దేశంలోనే నేను కేంద్రమంత్రిగా ఎదిగాను. సమర్థవంతంగా పని చేయగలుగుతున్నాను. ప్రజల కలల్ని నిజం చేయాలనే తపనతో పనిచేసే వ్యక్తి నిండు నూరేళ్లు బతకాలి. చంద్రబాబు అంటే ప్రజలందరికీ ఒక భరోసా. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఆయన కలకు అందరూ సహకరించాలి. ఆయన బాటలో పయనించాలి’ అని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.