Share News

Gotta Barrage: ఈ ఏడాదికి ఇంతేనా?

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:56 PM

Gotta Barrage: హిరమండలం వద్ద వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.

Gotta Barrage: ఈ ఏడాదికి ఇంతేనా?
గొట్టా బ్యారేజీ దిగువన పూర్తిగా దెబ్బతిన్న జడ్జిస్టోన్‌ ఎప్రాన్‌, సీసీ బ్లాకులు

- సమస్యల వలయంలో గొట్టాబ్యారేజీ

హిరమండలం, ఏప్రిల్‌21(ఆంధ్రజ్యోతి): హిరమండలం వద్ద వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. దీనికి అనుసంధానంగా సుమారు రూ.1,750 కోట్లతో వంశధార రిజర్వాయర్‌ను నిర్మిస్తుండడంతో బ్యారేజీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బ్యారేజీ మరమ్మతులకు నోచుకోవడం లేదు. నిర్వహణకు కనీస స్థాయిలో సిబ్బందిని కూడా నియమించడం లేదు. బ్యారేజీ దిగువన ఉన్న జడ్జిస్టోన్‌ ఏప్రాన్‌ పూర్తిగా దెబ్బతింది. రాళ్లు చెల్లాచెదురయ్యాయి. ఇంజనీరింగ్‌ నిపుణుల సూచన మేరకు జడ్జిస్టోన్‌ ఎప్రాన్‌ స్థానంలో కాంక్రీట్‌ ఎప్రాన్‌ నిర్మించాల్సి ఉంది. బ్యారేజీ దిగువ భాగంలో మరమ్మతు పనులకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.8.5 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌ పది శాతం పనులు చేసి నిలిపివేశాడు. తరువాత అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం 25 శాతం లోపు జరిగిన పనులను నిలిపివేయాలని ఆదేశించిం ది. అప్పటి నుంచి గొట్టాబ్యారేజీ పరిస్థితి దయనీయంగా మారింది. జగన్‌ సర్కారు ఎన్నికల సమయంలో రూ.12 కోట్లు నిధులు మంజూరు చేసింది. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ సూచనల మేరకు బ్యారేజీ దిగువన జడ్జిస్టోన్‌ ఏప్రాన్‌, సీసీ బ్లాకుల పునఃనిర్మాణానికి ఈ నిధులు సరిపోవని వంశధార అధికారులు కొత్తగా రూ.16.50 కోట్లతో ఎస్టిమేషన్లు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఖరీఫ్‌ ప్రారంభానికి మరో రెండు నెలలే ఉంది. ఇప్పుడు నిధులు మంజూరు చేస్తే వర్షాకాలం ప్రారంభానికి కొంత మేర పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.


పట్టని గేట్ల మరమ్మతులు

గొట్టాబ్యారేజీ 24 గేట్లతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న కుడి, ఎడమ కాలువల హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లు ఆరేళ్లుగా కనీస నిర్వహణకు నోచుకోవడం లేదు. ఫలితంగా అవి మర్మతులకు గురయ్యాయి. బ్యారేజి ఎగువ ప్రాంతంలో నీరు నిల్వ చేసేందుకు గేట్లు దించినప్పటికీ లీకేజీల ద్వారా నీరు వృథాగా పోతుంది. చివరి సారిగా 2018లో గేట్లకు మరమ్మతులు చేశారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో గేట్ల బేరింగ్‌లు, రోలర్లు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా వాటిని బాగు చేయాల్సిన అవసరం ఉంది.

20hlm3.gif

ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి లీకవుతున్న నీరు(ఫైల్‌)

Updated Date - Apr 21 , 2025 | 11:56 PM