Share News

Drinking water problems: గొంతెడుతోంది..

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:34 PM

Drinking water problems:ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు.

Drinking water problems: గొంతెడుతోంది..
ట్యాంకర్‌ వద్ద నీటిని పడుతున్న మహిళలు

- ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో దాహం కేకలు

- సరిగా పనిచేయని తాగునీటి వనరులు

- పట్టణ ప్రజలకు తప్పని ఇబ్బందులు

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. బిందెడు నీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ల వద్ద యుద్ధాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా తాగునీటి ఇబ్బందులే కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ఇవే వెతలు కొనసాగుతున్నా ప్రభుత్వాలు సరైన పరిష్కారమార్గం చూపడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 21 వార్డులు ఉన్న మునిసిపాల్టీలో 15 ఏళ్ల కిందట తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో 28 వేల మంది జనాభాకు తగ్గట్టుగా వీటిని వేశారు. కానీ, ఇప్పుడు పట్టణంతో పాటు జనాభా పెరిగింది. 2011 లెక్కల ప్రకారం 36 వేల మంది జనాభా అని చెబుతున్నా.. ఆ సంఖ్య 50 వేలకుపైగా ఉంటుందని అంచనా. అందుకు తగ్గట్టు నీటి సరఫరా లేకుండా పోతోంది. పట్టణ జనాభాకు రోజుకు సగటున 5.10 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం అందులో సగం నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 1,2,3 వార్డులకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భూ మట్టానికి మూడు నుంచి ఐదు అడుగుల గోతులో ఉన్న కుళాయి నుంచి నీటిని పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో 15 బోర్లు పనిచేయడం లేదని అధికారికవర్గాలు చెబుతున్నాయి. కానీ, అంతకు మించి బోర్లు మూలకు చేరాయని తెలుస్తోంది. ముఖ్యంగా రత్తకన్న పరిధిలో చాలా వీధులకు రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.


పైలెట్‌ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో?

ఉద్దానం ప్రాజెక్టులో భాగంగా బాహుదా నదిలో ఊటబావులు ఏర్పాటుచేశారు. వాటి ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. క్లోరినేషన్‌ చేపట్టిన తరువాత రాజావారితోటలోని రిజర్వాయర్‌ ద్వారా పట్టణ అవసరాల కోసం 8 లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజూ విడిచిపెడుతున్నారు. అయితే, ఈ నీరు ప్రజల అవసరాలకు ఏ మూలకు సరిపోవడం లేదు. రూ.54.48 కోట్ల కేంద్ర నిధులతో చేపడుతున్న పైలెట్‌ ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అది పూర్తయితే కానీ.. పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం లేదు. 1,2,3 వార్డుల పరిధిలోని పురుషోత్తపురం, ఏఎస్‌పేటకు ఏర్పాటుచేసిన పైపులైన్లు లీకులయ్యాయి. ట్రయల్‌ రన్‌ వేసి వదిలేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అరకొరగా సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. పురుషోత్తపురం పుష్పగిరి కొండపై 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకును నిర్మించి వృథాగా వదిలేశారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంలో ఇచ్ఛాపురం మునిసిపాల్టీకి చోటిచ్చారు. కానీ..ఇంతవరకూ నీటిని అందించలేదు. దీంతో ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వైసీపీ ఐదేళ్ల కాలంలో పట్టించుకోలేదు. దీంతో కూటమి ప్రభుత్వంపైనే మున్సిపల్‌ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.


దశాబ్దాలుగా ఇదే పరిస్థితి

పేరుకే మునిసిపాల్టీ. కానీ చిన్నపాటి గ్రామంకంటే తక్కువే. తాగునీటి సమస్య దశాబ్దాలుగా ఉంది. ఎప్పుడో 15 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్లు, కుళాయిలు పాడయ్యాయి. ఎప్పుడు నీటి సరఫరా ఉంటుందో? ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపాలి.

-సాలిన ఢిల్లీయాదవ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఏఎస్‌పేట, ఇచ్ఛాపురం

ఇబ్బంది లేకుండా చూస్తున్నాం

మునిసిపాల్టీలో తాగునీటి ఎద్దడి నిజమే. అయితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటిని అందిస్తున్నాం. ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. త్వరలో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంతో పాటు కేంద్ర నిధులతో చేపడుతున్న పైలెట్‌ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. అంతవరకూ ఇబ్బందులు తప్పవు.

- ఎన్‌ రమేష్‌, కమిషనర్‌, ఇచ్ఛాపురం మునిసిపాల్టీ

Updated Date - Apr 16 , 2025 | 11:34 PM