Mega Dsc: మెగా డీఎస్సీ వచ్చింది
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:26 AM
Teacher Recruitment Notification మెగా డీఎస్సీకి ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఏడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నారు.
నోటిఫికేషన్ విడుదలపై నిరుద్యోగుల్లో ఆనందం
ఉమ్మడి జిల్లాలో భర్తీకానున్న 543 పోస్టులు
పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు
నరసన్నపేట, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీకి ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఏడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం డీఎస్సీపై పెట్టారు. తాజాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారు సుమారు 23వేల మందికిపైగా ఉన్నారు. వీరంతా ఏడేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 543 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. జిల్లా, మండల పరిషత్, మునిసిపాలిటీల్లో 458 పోస్టులు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 85 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు గుర్తించింది. మెగా డీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనుంది. ముందుగా ప్రకటించిన కంటే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అధికంగా భర్తీ చేయనుండడంతో డీఈడీ, బీఈడీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు.
ఏడేళ్ల తర్వాత..
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. 2019లో గత వైసీపీ ప్రభుత్వం నియామక ప్రక్రియ పూర్తిచేసింది. నాటి నుంచి ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టుకూడా భర్తీ చేయలేదు. ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరలేపేలా సార్వత్రిక ఎన్నికల ముందు గతేడాది ఫిబ్రవరి 9న డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడంపై కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా అభ్యర్థులకు అనుకూలంగానే ఆదేశాలిచ్చింది. దీంతో డీఎస్సీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిణామాలను యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేశ్ దృష్టికి అభ్యర్థులు తీసుకెళ్లారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా డీఎస్సీ ప్రకటిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ డీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేయగా.. ఏడేళ్ల తర్వాత తమ కల ఫలిస్తోందని నిరుద్యోగులు సంబరపడుతున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభం
డీఎస్సీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు ప్రక్రియను ఆదివారం నుంచి విద్యాశాఖ ప్రారంభించింది. డీఈడీ చేసిన వారు మాత్రమే ఎస్జీటీ పోస్టులకు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌లకు సంబంధించి ఆయా మెథడాలజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు.
వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు
డీఎస్సీ అభ్యర్ధులకు వయోపరిమితిని సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గరిష్ఠ వయోపరిమితి 42 ఏళ్లు కాగా, దానిని 44 ఏళ్లకు పెంచారు. 2024 జూలై1న కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ సడలింపు ఈ ఒక్క డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుంది. దీంతో జిల్లాలో ఈ డీఎస్సీలో సుమారు 2 వేలమంది పరీక్షలు రాసేందుకు చివరి అవకాశం కలిగింది.
ఎస్సీ ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు
ఈ డీఎస్సీలో ఎస్సీ కులాల ఉపవర్గీకరణ ఆర్డినెన్స్-25 మేరకు రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. దీని ప్రకారం మూడు ఎస్సీ గ్రూపుల విషయంలో 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని అవలంభించనున్నారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్ మార్గం సుగమమైంది.
ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మునిసిపాలిటీల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు : 458
============
ఎస్జీటీ - 113
ఫిజికల్ ఎడ్యుకేషన్ -81
సాంఘికశాస్త్రం - 70
ఇంగ్లిషు -65
తెలుగు - 37
జీవశాస్త్రం - 34
గణితం -33
భౌతికశాస్త్రం -14
హిందీ- 11
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు : 85
============
ఎస్జీటీ -33
జీవశాస్త్రం -12
గణితం -13
ఇంగ్లిషు -12
భౌతికశాస్త్రం -10
సాంఘికశాస్త్రం -5
శుభపరిణామం
మాలాంటి వయసు మీరిన అభ్యర్థులకు డీఎస్సీ రాసే చాన్స్ ఉండదని అనుకున్నాం. కానీ ప్రభుత్వం వయో పరిమితి 44 ఏళ్లకు పెంచడం శుభపరిణామం. గత ఐదేళ్లు డీఎస్సీ కోసం ఎదురుచూశాం. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నేరవేర్చడం ఆనందంగా ఉంది.
- కోటపల్లి కోటిబాబు, జమ్ము, నరసన్నపేట
.............................
నాలుగేళ్లుగా..
గత నాలుగేళ్లు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ.. చదువుతున్నాం. ఇటీవల శాసనసభలో డీఎస్సీపై సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటనలు జారీ చేయడంతో ఆశలు చిగురించాయి.
- జె.పైడిరాజు, జలుమూరు
.....................
కల ఫలించనుంది
డీఎస్సీ పేరిట గత ప్రభుత్వం కాలయాపన చేసింది. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు అభ్యర్థించాం. ఆయన ఆనాడు మాట ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాఽధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం ఆనందంగా ఉంది. త్వరలో మా కల ఫలించనుంది.
- జగదీష్, నరసన్నపేట