వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ ఔట్
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:13 AM
నేనే వైసీపీకి రాజు.. నేనే మంత్రినంటూ ఇతర పార్టీల నాయకులతో పాటు సొంత పార్టీ నేతలపై నోరు పారేసుకునే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఆ పార్టీ నుంచి సస్పెం డ్ చేశారు.
శ్రీకాకుళం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): నేనే వైసీపీకి రాజు.. నేనే మంత్రినంటూ ఇతర పార్టీల నాయకులతో పాటు సొంత పార్టీ నేతలపై నోరు పారేసుకునే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఆ పార్టీ నుంచి సస్పెం డ్ చేశారు. ఈమేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కొంత కాలంగా శ్రీను.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ను అసభ్య పద జాలంతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. నోరెత్తితే బూతులు మాట్లాడి పార్టీకి చెడ్డపేరు తీసుకు వస్తున్నారని ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేశారు. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సూచనలతో దువ్వాడను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధినాయకత్వం ప్రకటిం చింది. దువ్వాడ వైసీపీలో చేరినప్పటి నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు ఇతర పార్టీల నేతలపై బూతులతో విమర్శలు చేశారు. అందు కు గాను నాడు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. దువ్వాడ 2019లో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ 2024లో వివిధ కారణాల దృష్ట్యా టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఘోర పరాజయం పొందారు. మరో మహిళతో సహజీవనం చేస్తున్నారని పేర్కొంటూ దువ్వాడ భార్య, పిల్లలు రోడ్డెక్కడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. వైసీపీకి చెడ్డ పేరు వస్తుండడంతో నష్ట నివారణకు ఈ చర్యలు చేపట్టారు.
అది నుంచీ వివాదాస్పదుడే..
ఎమ్మెల్సీ ఏ పార్టీలో ఉన్నా వివాదాస్పదుడిగానే ముద్ర పడింది. గతంలో టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలపై తిరుగు బాటు చేసిన సందర్భాలున్నాయి. అయితే వైసీపీలో చేరి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నమ్మిన బంటు గా పేరుతెచ్చుకున్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయ కులను కాదని దువ్వాడ మాటకే విలువ పెరిగేలా రాజకీయం చేశారు. అయితే వైసీపీ అధికారం కోల్పో వడం, ఆయన కుటుంబం రోడ్డెక్కడంతో టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి దువ్వాడను తప్పించి పేడాడ తిలక్‌కు ఇవ్వడం తెలిసిందే. అయితే ఇన్‌చార్జి బాధ్యతలను తప్పించినా వివాదాస్పద వ్యాఖ్యలు చేయ డం ఆయన మానలేదు. దీంతో పాటు పార్టీ లైన్ దాటుతున్నారని కొంతకాలంగా పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పాటు దువ్వాడ గత రెండు నెలలుగా టెక్కలిని విడిచి హైదరాబాద్‌కు మకాం మార్చారు. నాలుగు రోజుల కిందట నియోజక వర్గంలో అడుగుపెట్టి విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. అయితే ఏం జరిగిందో గాని ఎప్పుడో చేయా ల్సిన పనిని ఇప్పుడు పార్టీ అధిష్టానం ఇప్పుడు చేసిం దని పలువురు అభిప్రాయపడుతున్నారు. దువ్వాడ సస్పెన్షన్‌తో టెక్కలి వైసీపీలో రాజకీయాలు హీట్‌ను పెంచాయి.
దువ్వాడ వర్గానికి షాక్
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయడంతో ఆయన వర్గానికి షాక్ తగిలింది. ఎప్పటి కైనా దువ్వాడను మళ్లీ ఇన్‌చార్జిగా నియమిస్తారని ఎదురుచూస్తున్న ఆయన వర్గం పార్టీ నిర్ణయంతో ఆందోళన చెందుతోంది. వైసీపీ నాయకురాలు మాధురి సైతం పార్టీ ఇన్‌చార్జి మేము పెట్టిన భిక్ష అంటూ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా దువ్వాడ సస్పెన్షన్‌తో టెక్కలి వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది.