Rivers dry: ఎండిపోయాయ్!
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:53 PM
Water Crisis జిల్లాలోని ప్రధాన నదులు నాగావళి, వంశధార వేసవి ఆరంభంలోనే అడుగంటిపోతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా.. కొద్దిపాటి నీటితో పిల్లకాలువల్లా కనిపిస్తున్నాయి.
ఎడారిలా నాగావళి, వంశధార నదులు
నీరులేక ప్రజలకు తప్పని ఇబ్బందులు
శ్రీకాకుళం/ హిరమండలం/ గార/ కొత్తూరు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రధాన నదులు నాగావళి, వంశధార వేసవి ఆరంభంలోనే అడుగంటిపోతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా.. కొద్దిపాటి నీటితో పిల్లకాలువల్లా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళంలోని నాగావళి నది ద్వారా జిల్లాలో పలు గ్రామాల ప్రజలకు తాగునీరందుతుంది. మూగజీవాలు, పక్షుల దాహం కూడా ఈ నది తీర్చేది. ప్రస్తుతం నది నీరులేక ఎడారిని తలపిస్తోంది. రానున్న కొద్దిరోజుల్లో ఎండల తీవ్రతకు మరింత నీటి ఎద్దడి ఎదురు కానుందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలోని మురుగునీరు నదిలో పారుతుండడంతో.. అందులోనే పశువులు సేదతీరుతున్నాయి.
గొట్టా బ్యారేజీ.. డెడ్ స్టోరేజీ
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని సుమారు ఏడు మండలాల పరిధిలో వంశధార నది ప్రవహిస్తోంది. రెండున్నర లక్షలకుపైగా సాగునీటితోపాటు తాగునీటి అవసరాలను తీరుస్తున్న వంశధార నది కూడా వెలవెలబోతోంది. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం లేక హిరమండలంలోని గొట్టాబ్యారేజీ వద్ద నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. బ్యారేజీ ఎగువ ప్రాంతమంతా ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోయింది. ఇప్పటికే బ్యారేజీ దిగువన ఉన్న హిరమండలం రక్షిత నీటి పథకానికి నీరు అందక ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పాడుతున్నారు. అలాగే గార మండలంలోని బూరవెళ్లి నుంచి కళింగపట్నం వరకూ ప్రవహించే వంశధార నది అడుగంటిపోయింది. నదీ తీర గ్రామాల్లో బావులు, కుళాయిలు, వ్యవసాయ పంపుసెట్లలో భూగర్భజలాలు బాగా తగ్గిపోయాయి. కొత్తూరు మండల పరిధిలో కూడా వంశధార నదిలో నీటి నిల్వలు తగ్గి.. ఇసుక మేటలే కనిపిస్తున్నాయి. దీంతో నదీ తీరప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవి ఎలా గట్టెక్కుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
రిజర్వాయర్‌లోనూ అంతే
గతేడాది వర్షాలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో హిరమండలం వద్ద వంశధార రిజర్వాయర్‌లో నీటి నిల్వ అడుగంటింది. రిజర్వాయర్‌లో 8 టీఎంసీలు నిల్వచేసే అవకాశం ఉంది. కానీ వంశధార నదికి వరదలు లేకపోవడం, కొండ ప్రాంతాల నుంచి కూడా నీరు చేరకపోవడంతో ఈ ఏడాది సుమారు 5 టీఎంసీల వరకు నీరు చేరింది. గొట్టాబ్యారేజీ వద్ద నీటి నిల్వ తక్కువగా ఉండటంతో మార్చి నెల మొదటి వారం వరకు రిజర్వాయర్ నుంచి వంశధార కుడి కాలువకు నీటిని విడిచిపెట్టారు. దీంతో రిజర్వాయర్‌లో నీరు అడుగంటింది. ప్రస్తుతం 0.5టీఎంసీ మాత్రమే నిల్వ ఉందని వంశధార ఈఈ ఎం.వి.రమణమూర్తి తెలిపారు. వంశధార రిజర్వాయర్‌తోపాటు గొట్టాబ్యారేజీ వద్ద నీరు అడుగంటిపోవడంతో ఈ ఏడాది వర్షాలు కురిసే వరకు సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.