Share News

peansions: త్వరలో కొత్త పింఛన్లు

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:22 AM

Welfare Programs రాష్ట్ర ప్రభుత్వం జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించింది. త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.

peansions: త్వరలో కొత్త పింఛన్లు
మెళియాపుట్టి ఎంపీడీవో కార్యాలయం

  • జూలై నుంచి పంపిణీకి కసరత్తు

  • జిల్లాలో వేలాదిమందికి లబ్ధి

  • మెళియాపుట్టి మండలం మర్రిపాడు(సి) గ్రామానికి చెందిన మల్లిపురం అప్పలనరసమ్మ భర్త భయ్యలు 2023 డిసెంబర్‌లో మృతి చెందాడు. ఆమె వితంతువు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసినా గత వైసీపీ ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆమె వాపోతోంది.

  • .....................

  • మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురానికి చెందిన సిద్దల భారతికి భర్త చనిపోయి ఏడాది గడుస్తున్నా వితంతువు పింఛన్‌ రాలేదు. ఇంటి పెద్ద దిక్కులేక ఆమె ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది.

  • .....................

  • మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురానికి చెందిన సావిత్రిపాత్రో భర్త ఏడాదిన్నర కిందట కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు. ఆమె వితంతువు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా, మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతోంది. కూలికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి నెలకొందని వాపోతోంది.

  • .....................

  • ఇటువంటి వారందరికీ ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు రంగం సిద్ధం చేస్తోంది. పాత దరఖాస్తులను సైతం పరిశీలించి.. జూలై నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించడంతో జిల్లాలో చాలామందికి ప్రయోజనం దక్కే అవకాశం కనిపిస్తోంది.

  • మెళియాపుట్టి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించింది. త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో 3,47,798 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.83.72 కోట్లు పంపిణీ చేస్తోంది. ఏడాదిన్నర నుంచి కొత్త పింఛన్లు మంజూరుకాలేదు. దీంతో ప్రతి మండలం నుంచి 100 నుంచి 150 వరకు దరఖాస్తులు రానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 10వేల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సుమారు 5వేల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచేసింది. ఈ భారమంతా ప్రస్తుత ప్రభుత్వంపై పడనుంది. ప్రతినెలా సుమారు మరో రూ.40కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • అధికంగా బోగస్‌

  • వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ ద్వారా అధికంగా బోగస్‌ పింఛన్లు మంజూరు చేసిందనే విమర్శలున్నాయి. వైసీపీ నేతల కుటుంబ సభ్యులకే ఎక్కువగా పింఛన్లు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ దివ్యాంగ సర్టిఫికెట్లతో చాలా మంది లబ్ధి పొందారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తోంది. దివ్యాంగ పింఛన్‌దారుల సదరం ధ్రువపత్రాలను మరోసారి పరిశీలిస్తోంది. అలాగే కొంతమంది ఆధార్‌ కార్డుల్లో వయసు ఎక్కువగా మార్పు చేయించి.. వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. అనర్హులను తొలగించి.. అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. ప్రస్తుతం సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మెళియాపుట్టి ఎంపీడీవో ప్రసాద్‌ పండా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:22 AM