In Muscat: జీతాల్లేవ్.. తిండీ లేదు!
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:16 AM
In Muscat: విదేశీ ఉద్యోగాల పేరిట కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆకర్షణీయమైన జీతం, ఎన్నెన్నో ప్రయోజనాలంటూ నిలువునా ముంచేస్తున్నారు.
- విదేశీ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
- మస్కట్‌లో చిక్కుకున్న జిల్లా కార్మికులు
- వారితో షిప్‌లను క్లీనింగ్ చేయిస్తున్న వైనం
- పాస్‌పోర్టులు కూడా తీసుకుని బెదిరింపులు
- ఆందోళనలో బాధిత కుటుంబ సభ్యులు
-ఇచ్ఛాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
- సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తాం:
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): విదేశీ ఉద్యోగాల పేరిట కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆకర్షణీయమైన జీతం, ఎన్నెన్నో ప్రయోజనాలంటూ నిలువునా ముంచేస్తున్నారు. వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక వేరే పని చెబుతున్నారు. తాజాగా ఇలాంటి మోసమే వెలుగులోకి వచ్చింది. దళారుల బారినపడి ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన 9 మంది మస్కట్‌లో చిక్కుకున్నారు. ఇచ్ఛాపురం మండలం ధర్మపురానికి చెందిన జాని, కోటబొమ్మాళిలోని ఒక టెక్నికల్ ఇనిస్టిట్యూట్ ద్వారా తొమ్మిది మంది మస్కట్‌లోని నజీమ్ అబ్దుల్ సలాం ఇంటర్నేషనల్ కనస్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిర్చారు. అక్కడకు వెళితే ఆకర్షణీయమైన జీతంతో పాటు భోజనం, ఇతరత్రా వసతుఉలు కల్పిస్తారని చెప్పారు. తీరా అక్కడకు వెళ్లాక షిప్‌లు క్లీనింగ్ చేసే పనిలో పెట్టారు. జీతాలు ఇవ్వలేదు సరికదా భోజనాలు కూడా పెట్టడం లేదు. దీంతో బాధితులు ధర్మపురానికి చెందిన జానిని ప్రశ్నిస్తుంటే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. కనీసం పట్టించుకోవడం లేదు. కంపెనీ నిర్వాహకులు పాస్‌పోర్టులను సైతం తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయాన్ని వారు ఫోన్‌లో కుటుంబసభ్యులు తెలపడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని క్షేమంగా ఇంటికి తీసుకురాఆవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మస్కట్‌లో చిక్కుకున్న వారిలో దున్న కామరాజు, దున్న హేమసుందరరావు, డల్లీ జానకిరావు, ఏరాల రామకృష్ణ, బి.దుర్యోధన, ఎంపల్లి రాజు, పిల్ల సతీష్, పిలక భాస్కరావు, గుజ్జు జగదీష్ తదితరులు ఉన్నారు. బాధిత కుటంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు.
తరచూ మోసాలు..
గత కోద్దిరోజుఉలుగా జిల్లాలో విదేశీ ఉద్యోగాల పేరుతో ఎక్కువగా మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇంటర్వ్యూల సమయంలో చెప్పింది ఒకటి. అక్కడకు వెళ్లిన తరువాత పనులు మరొకటి అన్నట్టు ఉంది పరిస్థితి. దళారుల ద్వారా వెళుతున్న వారే ఎక్కువగా మోసాల బారిన పడుతున్నారు. అయితే ఇప్పుడు దళారులు గ్రామాల్లోకి సైతం వచ్చి ఆకర్షణీయమైన జీతం అంటూ నిరుద్యోగ యువతను ఆకర్షిస్తున్నారు. అధిక మొత్తంలో గుంజుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఇచ్ఛాపురం కేంద్రంగా చేసుకొని విదేశీ ఉద్యోగాల ఇంటర్వ్యూలు చేస్తుంటారు. జిల్లాలో టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఎక్కువగా విదేశాలకు వెళుతుంటారు. భవన నిర్మాణంతో పాటు పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తుంటారు. పదో తరగతి వరకూ చదవడం.. వెల్డర్, ఫిట్టర్, ఫ్యాబ్రికేటర్‌గా శిక్షణ తీసుకోవడం.. తరువాత ఉపాధి బాట పట్టడం ఉద్దానంలో పరిపాటిగా మారింది. అయితే గతం మాదిరిగా విదేశాల్లో ఉద్యోగాలు ఎమంత ఆశాజనకంగా లేవు. మేన్ పవర్ సొసైటీలు రంగంలోకి దిగి సొమ్ము చేసుకుంటున్నాయి. అభ్యర్థులను పంపించి వారిపై కమీషన్లను దండుకుంటోంది. గతంలో నైపుణ్యం చూసి.. సదరు కంపెనీలు తమకు విదేశాల్లో ఉండే పరిశ్రమలకు పంపించేవి. విమాన టిక్కెట్లతో పాటు వీసా, వసతి ఇలా అన్నింటినీ సమకూర్చేవి. దీంతో విదేశాల్లో పనిచేయడం లాభసాటిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అంతటా బ్రోకర్ వ్యవస్థ నడుస్తోంది. మేన్ పవర్ ఏజెన్సీలు, శిక్షణ సంస్థల మాటున విదేశీ పరిశ్రమల్లో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎంపిక చేసినందుకు కమీషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా బోగస్ కంపెనీల పేరుతో ఇంటర్వూలు నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
స్థానికంగానే ఇంటర్వూలు..
ఇచ్ఛాపురం పట్టణంలో ఎక్కువగా బోగస్ సంస్థలు వెలుస్తున్నాయి. స్థానికంగానే అభ్యర్థులకు వెల్డింగ్‌లో శిక్షణనిస్తున్నారు. అరకొర శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఒకవేళ విదేశాలకు వెళ్లినా అక్కడ పని ఒత్తడి తట్టుకోలేక తిరిగి వచ్చిన వారు ఉన్నారు. మరికొందరైతే అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక చాలా మంది మృత్యువాత పడుతుంటారు. అక్కడ పరిశ్రమల్లో కనీస భత్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాల బారినపడుతుంటారు. చాలా మంది చనిపోతుంటారు. మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతుంటారు. అటువంటి సమయంలో మృతదేహాలను స్వస్థలాలకు తెప్పించడం కత్తిమీద సాములా మారుతుంది. అక్కడ నిబంధనలు అడ్డంకిగా మారుతాయి. అటువంటి సమయంలో మృతదేహాల కోసం బాధిత కుటుంబ సభ్యులు రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తుంది. అయితే బొగస్ సంస్థలే ఎక్కువగా మోసాలు చేస్తున్న దృష్ట్యా వాటిపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది.
ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన దున్న కామరాజు కూలి పనికోసం ఈ ఏడాది జనవరిలో తోటి స్నేహితులతో కలిసి మస్కట్ వెళ్లాడు. టెక్నీషియన్ పని అని బ్రోకర్ చెప్పడంతో కామరాజు నమ్మాడు. బ్రోకర్‌కు రూ.70వేలు చెల్లించి మస్కట్ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తరువాత చెప్పిన పని ఇవ్వకుండా షిప్‌లు వాషింగ్ పని చేయించారు. తాను చేయలేనని చెప్పటంతో సరిగ్గా జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు కామరాజు తన తల్లిదండ్రులు సారది, సావిత్రి, భార్య ఊహకు ఫోన్‌లో చెప్పాడు. కామరాజుకు 4 ఏళ్ల మురళీకృష్ణ అనే కొడుకు ఉన్నాడు. రెండో సంతానంగా ఈ ఏడాది ఫిబ్రవరి 6న యశ్విన్ (3 నెలలు) పుట్టాడు. బాబును వీడియో కాల్ చేయటంతో చూశాడు. బాబును కూడా చూడలేకపోతున్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నకొడుకు ఇబ్బందులు చూడలేక తల్లిదండ్రులతో పాటు బార్య ఊహ కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి మస్కట్‌లో ఉన్న వారందర్నీ ఇండియా తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

చంటి బాబుతో కామరాజు భార్య ఊహ
బాధితులతో మాట్లాడిన రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మస్కట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది తెలుగు కార్మికులతో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు శుక్రవారం శ్రీకాకుళంలోని కార్యాలయం నుంచి వీడియో కాల్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. కార్మికుల కుటుంబాలు అధైర్య పడొద్దని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.

భాదితులతో వీడియోకాల్‌లో మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు