Share News

Government schools: భవిష్యత్తుకు మాది భరోసా

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:48 PM

school Developments ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. వైసీపీ పాలనలో అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యావ్యవస్థ గాడి తప్పింది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పలు సంస్కరణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శ్రీకారం చుట్టారు.

Government schools: భవిష్యత్తుకు మాది భరోసా
బొరిగివలస ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్న ఎంఈవో, ఉపాధ్యాయులు

  • ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి

  • జోరుగా ఉపాధ్యాయుల ప్రచారం

  • నరసన్నపేట, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. వైసీపీ పాలనలో అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యావ్యవస్థ గాడి తప్పింది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పలు సంస్కరణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శ్రీకారం చుట్టారు. ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్టు ఇటీవల పలు సందర్భాల్లో ప్రకటించారు. విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు.. ఊరూరా పర్యటిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రతీ గ్రామంలోనూ పర్యటిస్తూ గ్రామపెద్దలు, పొదుపు సంఘాల మహిళలు, ఉపాధిహామీ కూలీల వద్దకు కూడా వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరుతున్నారు. ఎంఈవోలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి.. మరింత అవగాహన కల్పిస్తున్నారు. ‘మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి. మీ పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తామ’ని భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగి.. చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

  • లక్ష్యానికి.. అంగన్‌వాడీల తూట్లు

  • ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అంగన్‌వాడీ, డీఆర్‌డీఏ, గ్రామపంచాయతీ ఉద్యోగుల సమన్వయంతో డ్రైవ్‌ను క్లస్టర్‌ హెచ్‌ఎంలు నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పీసీ1, పీపీ2 చదువుతున్న చిన్నారుల డేటాను అంగన్‌వాడీ కార్యకర్తలు సేకరించి.. ఆ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కానీ కొన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే తాయిలాలకు లొంగిపోయి.. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని తల్లిదండ్రులపై వారు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారిపై ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 17 , 2025 | 11:48 PM