Wakf: వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:59 PM
Muslim Community Rights వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం జేఏసీ నేతలు, వివిధ పౌరసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
ముస్లిం జేఏసీ, పౌర సంఘాల నేతల డిమాండ్
అరసవల్లి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం జేఏసీ నేతలు, వివిధ పౌరసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం శ్రీకాకుళంలో డైమండ్ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలతో ముస్లింల అణచివేతకు కారణమవుతోంది. ఈ చట్టం ద్వారా ముస్లిమేతరులకు వక్ఫ్‌బోర్డులో ప్రవేశం కల్పించడం అన్యాయం. ఈ చట్టాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తే సహించేది లేదు’ అని వారు హెచ్చరించారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తే దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుడతామని తెలిపారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అలాగే కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ.. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇది క్రూరమైన చర్య అని, ఈ సంఘటనకు కారకులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు బవిరి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి గోవిందరావు, నాయకులు తాండ్ర ప్రకాష్, కొంక్యాన వేణుగోపాల్, డి.గణేష్, రాంగోపాల్, మిస్కా కృష్ణయ్య, గంజి ఎజ్రా, జేఏసీ కన్వీనర్ షేక్ సలీం, అమీర్, ముజీబ్, రఫీ, మహిబుల్లాఖాన్, షాన్, జిలానీ సుక్రుఖాన్, వివిధ మసీదుల మత పెద్దలు పాల్గొన్నారు.