village festival : పకడ్బందీగా సిరిమానోత్సవం
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:17 AM
Sirimanu Festival ‘శ్రీకాకుళంలోని గ్రామదేవతల సిరిమానోత్సవాలను అన్నిశాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులంతా ఉత్సవ ఏర్పాట్లపై దృష్టి సారించాల’ని డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు ఆదేశించారు.
డీఆర్వో వేంకటేశ్వరరావు
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ‘శ్రీకాకుళంలోని గ్రామదేవతల సిరిమానోత్సవాలను అన్నిశాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులంతా ఉత్సవ ఏర్పాట్లపై దృష్టి సారించాల’ని డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు ఆదేశించారు. పాత శ్రీకాకుళంలోని ముత్యాలమ్మ, నక్కవీధిలోని నూకాలమ్మ, సంతోషిమాత జంక్షన్ వద్ద దుర్గమ్మ, మావూరు వీధిలోని పెద్దమ్మతల్లి, కొత్తపేట వద్ద సన్నాలపోలమ్మ పండుగలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 10న సిరిమానుల అనుపు ఉత్సవంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సిరిమానోత్సవ ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో డీఆర్వో సమావేశమయ్యారు. ‘మంచి వాతావరణంలో పండుగలు నిర్వహించాలి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని డీఆర్వో తెలిపారు. దీనిపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డీపీ దేవ్ మాట్లాడుతూ పదేళ్లకోసారి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాపరిషత్ నుంచి దేశల్ల వీధి, నక్కవీధి, దండివీధి, సంతోషిమాత జంక్షన్, మావూరు వీధి, కలెక్టర్ బంగ్లా, హరిజనవీధి, బాదుర్లపేట, కొత్తపేట, కునుకుపేట, కుందనపుపేట మీదుగా సిరిమానోత్సవం ఉంటుదన్నారు. సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, తహసీల్దార్ గణపతిరావు, నీటిపారుదల, రెవెన్యూ, దేవదాయశాఖ, వైద్యారోగ్యశాఖ, పోలీసు శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.