Share News

water problem: గుక్కెడు నీటి కోసం పాట్లు

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:25 PM

Drinking water crisis చుట్టూ ఎత్తయిన కొండల నడుమ జీవనం సాగిస్తున్న గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గుక్కెడు నీటికోసం సుమారు రెండు కిలోమీటర్లు నడిచివెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొత్తూరు మండలం అడ్డంగి పంచాయతీ దాపాకుల గూడ గ్రామ గిరిజనులు వేసవి వేళ.. తాగునీటి కోసం పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.

water problem: గుక్కెడు నీటి కోసం పాట్లు
కొండపై నుంచి నడుస్తూ నీటిని తెస్తున్న దాపాకుల గూడ మహిళలు, ఇన్‌సెట్‌లో కొండ చెలమ వద్ద నీటిని సేకరిస్తున్న గిరిజనులు

  • కొండల్లో చెలమలే ఆధారం

  • రెండు కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తేనే..

  • దాపాకుల గూడ గిరిజనులకు తప్పని ఇబ్బందులు

  • కొత్తూరు, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): చుట్టూ ఎత్తయిన కొండల నడుమ జీవనం సాగిస్తున్న గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గుక్కెడు నీటికోసం సుమారు రెండు కిలోమీటర్లు నడిచివెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొత్తూరు మండలం అడ్డంగి పంచాయతీ దాపాకుల గూడ గ్రామ గిరిజనులు వేసవి వేళ.. తాగునీటి కోసం పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కొత్తూరు మండల కేంద్రానికి మారుమూల ప్రాంతమైన దాపాకుల గూడలో 26 కుటుంబాల్లో 70 మంది జనాభా నివసిస్తున్నారు. తూర్పు భాగాన సుమారు కిలోమీటరు దూరంలో బొండూరుగూడ కొండల్లో చెలమనీరే వీరికి ఆధారం. అక్కడకు నడిచివెళ్లి.. గంటల కొలదీ నిరీక్షిస్తే బిందెడు నీరు కూడా దొరకడం కష్టమేనని గిరిజనులు వాపోతున్నారు. ఎత్తయిన కొండ ప్రాంతం కావడంతో కిందకు దిగాలన్నా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకపోయినా.. వేసవి వచ్చిందంటే తమకు తాగునీటి వెతలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండల్లో చెలమ నీటిని తెచ్చుకుని నిల్వ చేసుకుని వాడాల్సి వస్తోందని, ఈక్రమంలో కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొంటున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులు, పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేకపోతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:25 PM