Share News

Terror Attack: ఉగ్రదాడి.. పిరికిపంద చర్య

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:20 AM

Counter-Terrorism ‘కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై హఠాత్తుగా చేసిన ఉగ్రదాడి.. ఒక పిరికిపంద చర్య. దాడికి పాల్పడినవారిని వదిలే ప్రసక్తి లేదు’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.

Terror Attack: ఉగ్రదాడి.. పిరికిపంద చర్య
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • దాడిచేసిన వారిని వదిలే ప్రసక్తి లేదు

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

  • శ్రీకాకుళంలో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన

  • అరసవల్లి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ‘కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై హఠాత్తుగా చేసిన ఉగ్రదాడి.. ఒక పిరికిపంద చర్య. దాడికి పాల్పడినవారిని వదిలే ప్రసక్తి లేదు’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. ఉగ్రదాడికి నిరసనగా బుధవారం రాత్రి శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి కొవొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళి అర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ‘ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ దాడిచేసిన నిందితులను వదిలేది లేదు. శ్రీనగర్‌ నుంచి మొత్తం 4,500మంది ప్రయాణికులను ఇళ్లకు క్షేమంగా చేర్చేందుకు 35 విమానాలను ఏర్పాటు చేశాం. ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకున్నాం. ఈ దాడిలో రాష్ట్రానికి చెందిన మధుసూదన్‌, చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమ’ని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

  • మూల్యం చెల్లించక తప్పదు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అమాయక పర్యాటకులపై రాక్షసంగా దాడిచేసి హతమార్చిన దుండగులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ‘ఇది అత్యంత హేయమైన చర్య. మానవత్వానికే మాయని మచ్చ. దేశం యావత్తు ఈ దాడిని ఖండిస్తోంది’ అని అచ్చెన్న తెలిపారు. సూర్యమహల్‌ జంక్షన్‌ నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కింజరాపు హరివరప్రసాద్‌, మెండ దాసునాయుడు, మాదారపు వెంకటేష్‌, అరవల రవీంద్ర, కొమ్మనాపల్లి వెంకటరామరాజు, పాండ్రంకి శంకర్‌, రెడ్డి గిరిజాశంకర్‌, ఎస్వీ రమణమాదిగ, విభూది సూరిబాబు, ఉంగటి వెంకటరమణ, కవ్వాడి సుశీల, స్వచ్ఛంద సంస్థలు, కూటమి నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

  • ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి.. సిక్కోలు వాసే

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడి మృతుల్లో ఒకరైన జరజాపు సత్యచంద్రమౌళి(68) శ్రీకాకుళం జిల్లా వాసే. ఈయన కుటుంబం శ్రీకాకుళంలోని ఇందిరా నగర్‌ కాలనీలోనే ఉంది. సత్యచంద్రమౌళికి భార్య నాగమణి, కుమార్తెలు నిహారిక, అనిమిషతోపాటు ఇద్దరు సోదరులు ఉన్నారు. స్టేట్‌బ్యాంకులో ఉద్యో గం సాధించాక విజయనగరంతోపాటు.. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ.. బ్రాంచ్‌ మేనేజర్‌గా ప్రమో షన్‌ పొంది కొన్నాళ్ల కిందట రిటైర్డ్‌ అయ్యారు. చాన్నాళ్ల కిందట విశాఖపట్నంలోనే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. కుమార్తెలిద్దరికీ వివాహ మై.. వాళ్లు యూఎస్‌ఏలో స్థిరపడ్డారు. బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగుల మూడు కుటుంబాలు కశ్మీర్‌ పర్యటనకు ఈ నెల 18న వెళ్లారు. పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదుల దాడిలో సత్యచంద్ర మౌళి మృతి చెందారు. దీంతో సిక్కోలులో విషా దం చోటుచేసుకుంది. శ్రీకాకుళంలో నివసిస్తున్న పెద్దన్నయ్య జరజాపు ప్రకాశరావు(రిటైర్డ్‌ యూని యన్‌ బ్యాంకు మేనేజర్‌) హుటాహుటిన విశాఖప ట్నం వెళ్లారు. చంద్రమౌళి భౌతికదేహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవా రం రాత్రి నివాళి అర్పించారు. యూఎస్‌ఏ నుంచి కుమార్తెలు గురువారం వచ్చాక అంత్య క్రియలు నిర్వహిస్తారు. తన సోదరుడు పుట్టి పెరిగింది శ్రీకాకుళంలోనేనని.. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారని.. ఈ ఘటనతో మమ్మల్ని ఎంతగానో కలచివేసిందని ప్రకాశ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో సత్య చంద్రమౌళితో పరిచయం ఉన్నవాళ్లందరూ విషాదంలో మునిగిపోయారు.

Updated Date - Apr 24 , 2025 | 12:20 AM