యాప్‌ల భారం తగ్గింది
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:34 PM
గత వైసీపీ ప్రభుత్వంలో యాప్‌లు బాధపడలేక ఉపాధ్యాయులు తలలు పట్టుకునేవారు.
నరసన్నపేట, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో యాప్‌లు బాధపడలేక ఉపాధ్యాయులు తలలు పట్టుకునేవారు. విద్యార్థుల హాజరుకు యాప్.. ఉపాధ్యాయుల ముఖహాజరుకు యాప్.. మధ్యాహ్న భోజనం అమలుకు యాప్.. మరుగుదొడ్ల నిర్వహణకు యాప్.. విద్యార్థుల మార్కుల అప్‌లోడ్‌కు యాప్.. ఇలా ఉపాధ్యాయులు ఇంతకాలం అల్లాడిపోయారు. పాఠశాలకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు యాప్‌లతో ఆపసోపాలు పడాల్సి వచ్చేంది. ఉపాధ్యాయులంటే విద్యార్థులకు బోధన చేయాలి. కానీ వైసీపీ హయాంలో తీసుకువచ్చిన యాప్‌లతో బోధన పక్కన పెట్టాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయులకు యాప్‌ల కష్టాలు నుంచి ఊరట కల్పించింది. వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు నిత్యం పదికిపైగా యాప్‌లలో సమాచారం పంపాల్సి వచ్చేది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీ అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం యాప్‌ల భారం తగ్గించింది. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న నారా లోకేష్.. పాఠశాల స్థాయిలో ఒకే యాప్‌ను తీసువస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజుల్లో దీన్ని అమలు చేశారు.
- జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,955, ప్రాథమికోన్నత పాఠశాలలు 269, ఉన్నత పాఠశాలలు 414 ఉన్నాయి. వీటిలో 1,71,535 మంది విద్యార్థులు ఉండగా.. 10,914 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో యాప్‌ను ప్రవేశ పెట్టారు. ఉపాధ్యాయులపై కక్షసాధింపులా వీటిని ప్రవేశపెట్టారన్న విమర్శలు వచ్చినా.. యాప్‌లు కష్టాల నుంచి తప్పించాలని ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టినా నాటి ప్రభుత్వం స్పందించలేదు. దాదాపు పదికిపైగా యాప్‌లతో నిత్యం ఉపాధ్యాయులు కుస్తీ పడాల్సి వచ్చేది.
ఇక అన్నింటికీ లీప్ యాప్..
ప్రభుత్వం తాజాగా లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (లీప్) పేరుతో యాప్‌ను తీసుకువచ్చింది. లీప్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకునేలా ఏర్పాటు చేసింది. జిల్లాలో డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాఽధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా తమ మొబైల్‌లో లీప్ యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గతంలో ఉన్న టీచర్ అటెండెన్స్ యాప్ ఆటోమెటిక్‌గా లీప్‌గా మార్పు చేసింది. గతంలో వాడిన యూజర్ నేమ్.. పాస్‌వర్డులనే ఇప్పుడూ వినియోగించాలని సూచించింది. ఈ యాప్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, ఎండీఎం నిర్వహణ చేయాల్సి ఉంది. అలాగే ఉపాధ్యాయులకు చెందిన పూర్తి సమాచారం కూడా ఈ యాప్‌లో ఆప్‌లోడ్ చేయాలి.