water problem: పలాసకు ‘ఉద్దానం’ నీరు
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:50 PM
Uddanam Water Supply ఒక చిన్న ఆలోచన మునిసిపాలిటీకి రూ.కోట్లు పొదుపు చేసినట్లయింది. కేవలం రూ.63లక్షల వ్యయంతో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటిలోని 31 వార్డులకు తాగునీరు ఇచ్చేందుకు మార్గం సుగమమయింది. దీనికి సంబంధించిన పనులు శరవేగంతో సాగుతున్నాయి. 15 రోజుల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
15 రోజుల్లో ఇచ్చేందుకు శరవేగంగా పనులు
పలాస, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఒక చిన్న ఆలోచన మునిసిపాలిటీకి రూ.కోట్లు పొదుపు చేసినట్లయింది. కేవలం రూ.63లక్షల వ్యయంతో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటిలోని 31 వార్డులకు తాగునీరు ఇచ్చేందుకు మార్గం సుగమమయింది. దీనికి సంబంధించిన పనులు శరవేగంతో సాగుతున్నాయి. 15 రోజుల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటికి వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీటి కష్టాలు ప్రారంభం అవుతాయి. శాశ్వత మంచినీటి పథకాలు ఏవీ లేకపోవడంతో స్థానికంగా ఉండే నీటి వనరులపై ఆధారపడాల్సి వచ్చేది. ఏటా వేసవిలో తాగునీరు సరఫరాకే రూ.40లక్షల వరకూ వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన టీడీపీ ప్రభుత్వం(2014-19 మధ్య) ఆఫ్‌షోర్ ఆధారిత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టి రూ.100కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంతో ఆ ప్రతిపాదన వెనక్కి మళ్లిపోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సమగ్ర మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు వంశధార నీటిని హిరమండలం వద్ద స్లంప్ నిర్మించి గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అయితే పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీని అందులో చేర్చకపోవడంతో ఆ నీరు రావడం లేదు. మునిసిపాలిటీ మీదుగా అంతర్గత పైపులైన్ల ద్వారా నీరు ఇచ్ఛాపురం వైపు వెళ్తున్నా ఆ నీటికి తీసుకురావడానికి అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. దీంతో మునిసిపాలిటీకి తాగునీటి సరఫరా కలగా మిగిలింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.నారాయణ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లారు. కనీసం సగం నీరయినా ఇవ్వాలని కోరినా సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ పని సాధ్యం కాలేదు. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్రమంత్రి హోదాలో తీసుకువచ్చిన ఉద్దానం రక్షిత మంచినీటి పథకాన్ని మునిసిపాలిటీకి అనుసంధానిస్తే తక్కువ ఖర్చుతో నీరు ఇవ్వచ్చనే ఆలోచన రావడంతో ఎమ్మెల్యే ఆ దిశగా అధికారులను ఒప్పించారు. దీనికి సంబంధించిన సాంకేతిక అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో కలెక్టర్ చొరవ తీసుకొని మునిసిపాలిటీ నిధులు రూ.63లక్షలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పైపులైన్ల పనులు చురుగ్గా చేపడుతున్నారు. ప్రస్తుతం 900 మీటర్లకు సంబంధించి పైపులైన్ల నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. ఉద్దానం రక్షిత మంచినీటి పథకం కార్యాలయం ఆవరణలో ఉన్న ఉపరితల ట్యాంకులను పైపులు అనుసంధానం చేస్తే మునిసిపాలిటీకి అదనంగా 5 ఎంఎల్‌డీ నీరు అందించవచ్చు. ఆ మేరకు అంగీకారం కుదరడంతో 15 రోజుల్లో ట్రయల్ రన్ వేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయితే ఆఫ్‌షోర్ రిజర్వాయరు ఆధారిత మంచినీటి పథకం పూర్తయ్యే వరకూ మునిసిపాలిటీకి ఉద్దానం రక్షిత నీరు వినియోగపడుతుందనడంలో సందేహం లేదు.
శాశ్వతంగా నీటిని అందిస్తాం
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి శాశ్వత మంచినీటి పథకం రప్పించేందుకు తీవ్ర కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం కనీసస్థాయిలో కూడా పట్టించుకోలేదు. ఉద్దానం రక్షితనీటిని ప్రజలకు అందిస్తాం, ఆఫ్‌షోర్ పూర్తయిన వెంటనే శాశ్వతంగా మంచినీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పథకాన్ని రప్పించే ఏర్పాట్లు చేస్తాం.
- గౌతు శిరీష, పలాస ఎమ్మెల్యే
15 రోజుల్లో ట్రయల్‌ర న్
ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవతో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి ఉద్దానం రక్షిత నీటి పథకం ద్వారా నీటి కష్టాలు తీరనున్నాయి. 15 రోజుల్లో పైపులైన్లు వేసి నీరందించడానికి ట్రయల్‌రన్ నిర్వహిస్తాం. ఈ వేసవిలోనే ప్రజలకు సరిపడా తాగునీరు అందిస్తాం.
-ఎన్.రామారావు, కమిషనర్, పలాస-కాశీబుగ్గ