Cm tour: మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:33 PM
Beginning of ‘In the Service of Fishermen’ ‘కూటమి ప్రభుత్వ పాలనలో మత్స్యకారుల దశ మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థికసాయం రెట్టింపు చేశాం. దీని వల్ల రాష్ట్రంలో 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల మేర లబ్ధి చేకూరింద’ని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. గత పాలకుల మాదిరి బటన్ నొక్కకుండా.. ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని వెల్లడించారు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.
వేట నిషేధ సమయంలో రూ.20వేల సాయం విడుదల
1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి
బుడగట్లపాలెంలో ‘మత్స్యకారుల సేవలో’ ప్రారంభం
బటన్ నొక్కడం కాదు.. ప్రజా సంక్షేమమే ధ్యేయం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వ పాలనలో మత్స్యకారుల దశ మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థికసాయం రెట్టింపు చేశాం. దీని వల్ల రాష్ట్రంలో 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల మేర లబ్ధి చేకూరింద’ని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. గత పాలకుల మాదిరి బటన్ నొక్కకుండా.. ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని వెల్లడించారు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. శనివారం ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో ‘మత్స్యకార సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మత్స్యకారులు తూరాడ అప్పన్న, అలుపల్లి తవితాయి కుటుంబాలకు చెరో రూ.20వేల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మత్స్యకారుల కష్టాలు నాకు తెలుసు. ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లడం.. వారు తిరిగి వచ్చే వరకూ ఆడబిడ్డలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూడటం నేను స్వయంగా చూశాను. కొందరు వ్యాపారులు బోట్లను ఇచ్చి.. మత్స్యకారుల ఆదాయం వాళ్లే కొట్టేస్తున్నారు. మీ కష్టాలు తీర్చేందుకు నేనున్నాను. మత్స్యకారులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. మత్స్యకార గ్రామాలు టీడీపీకి అండగా నిలబడ్డాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని రూ.10వేల నుంచి రూ.20వేల వరకు పెంచామ’ని సీఎం తెలిపారు.
అభివృద్ధి అంటే బటన్ నొక్కడం కాదు..
‘గత పాలకుల్లా బటన్ నొక్కి ప్రచారం చేసుకోవడం నాకూ వచ్చు. కానీ చేయాల్సింది అదికాదు. ప్రజలందరికీ సంక్షేమం అందించడమే నా ధ్యేయం. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో రూ.300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా బాగుపడిందా? టీడీపీ ప్రభుత్వం హయాంలోనే మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు ప్రతినెలా పింఛన్లు అందిస్తున్నాం. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నాం. వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ. 9 సబ్సిడీ ఇస్తున్నామ’ని సీఎం తెలిపారు.
దేశమంతా శ్రీకాకుళం వాసులే..
‘హైదరాబాద్, ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉంటాయి. ఆర్మీలో శ్రీకాకుళం జిల్లా వాసులే అధికంగా ఉన్నారు. జిల్లాలో తెలివితేటలున్న నాయకులకు కొరత లేదు. నాగావళి, వంశధార ద్వారా నీరు సమృద్ధిగా వస్తుంది. జిల్లా వెంబడి ఎక్కువ జాతీయ రహదారులు ఉన్నాయి. ఇక్కడి ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. జిల్లాకు చెందిన సామాన్య టీడీపీ కార్యకరర్త కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ అయ్యారు. ముచ్చటగా మూడోసారి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రి అయ్యాడు. ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళమే. జిల్లాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఎచ్చెర్ల కాగా.. తక్కువగా ఉన్న ప్రాంతం బుడగట్లపాలెం. నేను భోగాపురం ఎయిర్ పోర్టు తీసుకువస్తే గత పాలకులు దాన్ని అటకెక్కించారు. మళ్లీ నేనే దాన్ని పూర్తిచేస్తాను. ఆనాడు నా మిత్రుడు కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఉద్దానానికి నీళ్లు తెచ్చారు. ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తికాబోతుంది. రామ్మోహన్ నాయుడు పనితీరును ఢిల్లీ నాయకులు గొప్పగా చెబుతున్నారు. అయితే శ్రీకాకుళం అభివృద్ధి కాకపోతే నీ డిగ్రీ తిరిగి ఇవ్వాల్సిందేనని రామ్మోహన్‌కు నేను తేల్చి చెప్పాను’ అని సీఎం అన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా...
‘ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. 9 ఫిషింగ్ హార్బర్లు సిద్ధం చేస్తున్నాం. బోట్లు కొనిచ్చి గ్రామాన్ని ఒక సెంటర్‌గా తీసుకుని ఆర్థికంగా ఆదుకుంటాం. ఏడాదిలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌ను పూర్తిచేసి ప్రారంభిస్తాం. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు కోరిన సమస్యలలో నారాయణపురం, మడ్డువలస స్టేజ్-2, తోటపల్లి కాలువ.. ఈ మూడు పూర్తి చేసి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. అణువిద్యుత్ కేంద్రం ఆర్‌అండ్‌ఆర్, పీడీఎఫ్ ఇవాల్సిన బాధ్యత తీసుకుంటా. పేదరికం ఉండకూడన్న లక్ష్యంతో బంగారు కుటుంబాలు.. మార్గదర్శకులను తీసుకు వచ్చాను. ఈ గ్రామంలో 499 ఇళ్లు ఉన్నాయి. 18 మందికి ఇంటి జాగాలేదు. 6 నెలల్లోగా ఇళ్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు బాగా పనిచేస్తున్నారు. రిజర్వాయర్లు సహా కాలువలు పూర్తిచేసి ఎచ్చెర్లను సస్యశ్యామలం చేస్తాం. భావనపాడు పోర్టును నిర్మించాలనుకున్నాం. గత పాలకులు దాన్ని మూలపేటకు తెచ్చారు. ఐదేళ్లు ఆలస్యమైంది. రాబోయే సంవత్సరంలో మూలపేట పోర్టు పూర్తిచేస్తాం. ఇక్కడి ప్రజల ఆదాయం పెరగాలి. దీనికోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నా. పత్రి ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల భూమి ఇవ్వాలని ఇక్కడే కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తున్నా. ఆరు నెలల్లో అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్‌ది. 371 ఇళ్లు ఉండగా.. 170 ఇళ్లు శాశ్వత నిర్మాణాలు కావు. అలాగే కూలిన ఇళ్లకు ఇళ్లను మంజూరుచేసి వాటినిర్మాణ బాధ్యత అధికారులు చూడాలి. కరెంట్ కనెక్షన్, సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేస్తున్నాం. గ్యాస్ కనెక్షన్‌లు.. 32ఇళ్లకు లేవు. వాటినీ మంజూరు చేస్తున్నాం. జలజీవన్ మిషన్ పనుల గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తికాలేదు. అవి పూర్తయ్యే వరకు నీరిచ్చే బాధ్యత అధికారులే తీసుకోవాలి. 2,430 మీటర్ల సీసీ రోడ్లు అవసరముంది. వాటిని మంజూరు చేసి పూర్తిచేయాలి. ప్రస్తుతం జనాభా సంఖ్య తగ్గుతోంది. పిల్లలను కనే బాధ్యత ప్రతి భార్య, భర్త తీసుకోండి. వారిని చదివించే బాధ్యత మాది. సీవీల్ తయారు చేసుకుంటే మంచి సంపద లభిస్తుంది. హెక్టార్‌కు కనీసం పది లక్షల ఆదాయం వస్తుందని మా అధికారులు చెబుతున్నారు. ఈ ఊరిలో సీవీల్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటుచేస్తాం. ఈ ఊరు బాగుపడితే అన్ని మత్స్యకార గ్రామాలకు ఆ విధానం తీసుకువెళ్తాం. సముద్రం దగ్గరలోనే చేపలు ఉత్పత్తి అయ్యేలా ఆర్టిఫిషియల్ టీమ్స్ ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ముప్పై శాతం సమయం ఆదా అవుతుంది. ఆదాయం మూడు రెట్లు పెరుగుతుంది. అనకాపల్లిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్ వస్తోంది. దీనివల్ల 40 వేల మందికి ఉపాధి లభించనుంది’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనంతరం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.


