Kurmam: తాబేళ్లకు ఏమైంది?
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:16 AM
Turtle Disappearance శ్రీ మహావిష్ణువు రెండో అవతారమైన శ్రీకూర్మక్షేత్రంలో తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత రెండు రోజుల్లో సుమారు 15 తాబేళ్లు చనిపోయాయి. శ్వేతపుష్కరిణి గోడ పక్కన కాలిపోయి.. తాబేళ్ల కళేబరాలు కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీకూర్మంలో మృత్యువాత
పుష్కరిణి గోడ పక్కన కళేబరాలు
ఆందోళనలో భక్తులు
గార, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): శ్రీ మహావిష్ణువు రెండో అవతారమైన శ్రీకూర్మక్షేత్రంలో తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత రెండు రోజుల్లో సుమారు 15 తాబేళ్లు చనిపోయాయి. శ్వేతపుష్కరిణి గోడ పక్కన కాలిపోయి.. తాబేళ్ల కళేబరాలు కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాబేళ్లకు ఏమైందంటూ కలవరపడుతున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట ఈ క్షేత్రంలో తాబేళ్ల కోసం పార్కు ఏర్పాటు చేశారు. తాబేళ్ల సంరక్షణను దేవాలయ అధికారులు పర్యవేక్షించేవారు. కొన్నాళ్ల కిందట కొత్తగా తాబేళ్ల పార్కు నిర్మించారు. తాబేళ్ల నిర్వహణ బాధ్యతను శ్రీకాకుళానికి చెందిన గ్రీన్‌మెర్సీ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. తాబేళ్లకు ఆహారం, నీరు, తదితర నిర్వహణ కోసం ఈ సంస్థకు ప్రతి నెలా రూ.24వేలు ఈ సంస్థకు చెల్లించేలా అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థ స్థానికంగా ఒక మహిళను నెలవారీ జీతానికి నియమించి తాబేళ్ల సంరక్షణ బాధ్యతను అప్పగించింది. ప్రస్తుతం ఇక్కడ సుమారు 200 తాబేళ్లు ఉన్నాయి. పార్కులో ఉన్న తాబేళ్ల వివరాలను గ్రీన్‌మెర్సీ స్వచ్ఛంద సంస్థ ప్రతి నెలా ఆలయ అధికారులకు ఇవ్వాలి. కాగా.. కొంతమంది భక్తులు తాబేళ్లు తెచ్చి ఇక్కడ పార్కులో విడిచిపెడుతుంటారు. ఈ క్రమంలో తాబేళ్ల నిర్వహణ కష్టంగా ఉందని, వేరే దేవాలయానికి వాటిని అప్పజెప్పాలని నిర్వాహకులు చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో భక్తులు ఆ తాబేళ్లను వెనక్కి తీసుకెళ్లకుండా.. ఆలయ ప్రాంగణంలోనే వదిలేసి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వాటికి సంరక్షణ కరువై కొన్ని మృతి చెందుతున్నట్టు సమాచారం. ఆదివారం శ్వేతపుష్కరిణి గోడ పక్కన కొన్ని తాబేళ్లు కాలిపోయి కనిపించడంతో భక్తులు ఆలయ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. తాబేళ్లను సంరక్షించాలని కోరారు.
ఈ విషయమై తాబేళ్ల పార్కులో ఉన్న మహిళ వద్ద ప్రస్తావించగా.. ‘తాబేళ్ల సంరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. మాకు తొలుత 120 తాబేళ్లు అప్పగించారు. ప్రస్తుతం మా లెక్క ప్రకారం 187 వరకు ఉన్నాయి. భక్తులు ఇచ్చిన వాటితో కలిపి సుమారు 200 తాబేళ్లు పార్కులో ఉండవచ్చు. గత నెలలో ఒకటి, ఆదివారం రెండు తాబేళ్లు చనిపోయాయి’ అని తెలిపింది.
జిల్లా ఇన్‌చార్జి దేవదాయశాఖాధికారి వై.భద్రాజీ వద్ద ప్రస్తావించగా.. ‘శ్రీకూర్మం దేవస్థానంలో తాబేళ్లు చనిపోతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అక్కడి సిబ్బందితో మాట్లాడాం. ఈ విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఇటువంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బదిని ఆదేశించామ’ని తెలిపారు.