Share News

trauma care: ట్రామా‘కేర్‌’ ఎక్కడ?

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:45 PM

trauma care: జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఉన్న ట్రామాకేర్‌ సెంటర్‌ సమస్యలతో సతమతమవుతోంది.

 trauma care:  ట్రామా‘కేర్‌’ ఎక్కడ?
రిమ్స్‌ ఆసుపత్రిలోని ట్రామాకేర్‌ ఆపరేషన్‌ థియేటర్‌

- సమస్యలతో సతమతం

- వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీ

- పరికరాలు, బెడ్లు కొరత

- ఇదీ రిమ్స్‌లోని ట్రామాకేర్‌ సెంటర్‌ పరిస్థితి

అరసవల్లి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఉన్న ట్రామాకేర్‌ సెంటర్‌ సమస్యలతో సతమతమవుతోంది. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. సరిపడ వైద్య పరికరాలు, బెడ్లు లేవు. సర్జరీలు నిర్వహించేందుకు ఆపరేషన్‌ థియేటర్‌ కూడా అందుబాటులో లేదు. కొన్ని కేసులను విశాఖపట్నానికి రిఫర్‌ చేస్తున్నారు. ట్రామాకేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి 12 ఏళ్లు దాటినా సిబ్బంది నియామకాలు గానీ, అవసరమైన ప్రత్యేక సదుపాయాలు గానీ కల్పించలేదు. నిజానికి రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ట్రామాకేర్‌ సెంటర్‌లో వైద్యసేవలను అందిస్తారు. ఇది ఒక ప్రత్యేక విభాగంగా పనిచేస్తుంది. దీన్ని పర్యవేక్షించేందుకు ఒక నోడల్‌ అధికారి కూడా ఉండాలి. శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలోని ట్రామాకేర్‌కు సంబంధించి ఐదుగురు సీఎంవోలు, ఇద్దరు జనరల్‌ సర్జన్లు, ఇద్దరు ఎముకల వైద్య శస్త్రచికిత్స నిపుణులు, న్యూరో శస్త్రచికిత్స వైద్యులు ఇద్దరు, మత్తు వైద్య నిపుణులు ముగ్గురు ఉండాలి. కానీ, ఇక్కడ అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 21 మంది నర్సింగ్‌ సిబ్బందికి ప్రస్తుతం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 19 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎంఎన్‌వోలు, బార్డు బాయ్స్‌ 24 మంది వరకు ఉండాలి. కానీ, కేవలం ఇద్దరే పనిచేస్తున్నారు. 12 ఏళ్ల కిందట ట్రామాకేర్‌ సెంటర్‌ భవనం కోసం విడుదల చేసిన రూ.5కోట్ల నిధులను వేరే అవసరాలకు వాడుకున్నారు. దీంతో ప్రత్యేక భవన నిర్మాణం ప్రక్రియ ఆగిపోయింది.


శస్త్ర చికిత్సల నిర్వహణకు ఇబ్బంది..

రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలైన వారిలో కొందరికి మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి ఉంటుంది. రిమ్స్‌ ట్రామాకేర్‌కు రోజుకు కనీసం 20 నుంచి 25 మంది వరకు క్షతగాత్రులు వస్తుంటారు. వారిలో ప్రతిరోజూ సుమారు 20 మందికి చిన్నపాటి శస్త్ర చికిత్సలు, కనీసం రెండు నుంచి మూడు మేజర్‌ శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. ట్రామాకేర్‌లో వైద్యులు లేకపోయినా రిమ్స్‌ డాక్టర్లు నిత్యం ఈ చికిత్సలను అందిస్తున్నారు. అయితే, ఈ సమయంలో వారికి ఒక్క సహాయకుడు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సరైన ఆపరేషన్‌ థియేటర్‌ కూడా అందుబాటులో లేదు. పరికరాలు కూడా సరిపడా లేవు. అలాగే, ఆరు వెంటిలేటర్లకు గాను రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. మొబైల్‌ ఎక్స్‌రే యూనిట్‌ కూడా తరచుగా మొరాయిస్తుంది. దీంతో కొన్ని కేసులను విశాఖపట్నానికి రిఫర్‌ చేస్తున్నారు. అదే విధంగా 20 బెడ్లు మాత్రమే ఉన్నాయి. మరో 10 బెడ్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. మరో ఆపరేషన్‌ థియేటర్‌ను కూడా తాత్కాలికంగా అందుబాటులో ఉంచాలని, అప్పుడే మరిన్ని సేవలను అత్యవసర సమయాల్లో అందించగలమని వైద్యులు అంటున్నారు. ఈ విషయమై అధికారులు, నాయకులు దృష్టి సారించి ట్రామాకేర్‌ సెంటర్‌లో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:45 PM