Tdp leader: ఎచ్చెర్లకు నాయకుడెవరు?
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:09 AM
Etcherla leader రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన నడుస్తోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి 164 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ అభ్యర్థులకు 135 స్థానాల్లో విజయం దక్కింది.
ఏడాదిగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఖాళీ
ఎన్నికల్లో కూటమి తరపున బీజేపీ అభ్యర్థి గెలుపు
తెలుగుదేశం పార్టీ కేడర్‌ను సమన్వయం చేసేవారు కరువు
అధినేత చంద్రబాబు దృష్టి సారించాలని కార్యకర్తల వినతి
రణస్థలం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన నడుస్తోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి 164 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ అభ్యర్థులకు 135 స్థానాల్లో విజయం దక్కింది. అయితే వైసీపీతోపాటు భాగస్వామ్య పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న 40 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఎచ్చెర్ల నియోజకవర్గం ఒకటి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు విజయం సాధించారు. కాగా.. ఇక్కడ టీడీపీకి ఇంతవరకూ ఇన్‌చార్జిని నియమించకపోవడం లోటే. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడంతో కేడర్‌ను సమన్వయం చేసేవారు కరువయ్యారు. ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ద్వితీయ శ్రేణి నాయకులే సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రకటన చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.
బలమైన కేడర్ ఉన్నా.. టీడీపీకి లోటే..
ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచీ పదిసార్లు ఎన్నికలు జరగ్గా.. ఆరుసార్లు ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇది 2004 వరకూ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో జనరల్ అయ్యింది. ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరిన ప్రతిభాభారతి 1983 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసి విజయం సాధించారు. 1999 వరకూ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి గెలుస్తూనే ఉన్నారు. కానీ 2004, 2009 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. 2014లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కళా వెంకటరావు గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి, 2024 ఎన్నికల్లో టీడీపీ సహకారంతో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో ఎచ్చెర్ల, రణస్థలం, జి.సిగడాం, లావేరు మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాలు టీడీపీకి పట్టున్నవే. క్షేత్రస్థాయిలో ఇక్కడ టీడీపీకి బలం ఉన్నా.. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే కావడంతో ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. పైగా ఎన్నికలకు ముందు వైసీపీ మెజార్టీ కేడర్ బీజేపీలోకి వచ్చింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో బీజేపీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. జనసేన పార్టీకి కూడా నియోజకవర్గ బాధ్యులు, కార్యవర్గ సభ్యులు ఉండడంతో సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. కాగా టీడీపీ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు లేవు. టీడీపీ సభ్యత్వ నమోదును మండలాల నాయకులు విజయవంతంగా పూర్తిచేశారు. కానీ కార్యక్రమాల నిర్వహణ, సభలు, సమీక్షలు, సమన్వయం విషయంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందర్నీ సమన్వయం చేసే సీనియర్ నేతకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని కేడర్ కోరుతోంది. ఇప్పటికైనా టీడీపీ అధిష్ఠానం, జిల్లా నాయకత్వం ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది.