Tribal roads: ఎప్పటికి ‘దారి’కొచ్చేనో?
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:28 PM
Tribal roads:గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన రహదారుల పనులు ముందుకు కదలడం లేదు.
- నిధులున్నా చేపట్టని రహదారుల పనులు
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
- గిరిజనులకు తప్పని ఇబ్బందులు
మెళియాపుట్టి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన రహదారుల పనులు ముందుకు కదలడం లేదు. నిధులు ఉన్నా పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో అన్ని రోడ్ల పనులను ప్రారంభించి వదిలేశారు. ఎక్కడికక్కడే తవ్వేసి విడిచిపెట్టడంతో గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మెళియాపుట్టి మండలంలో 57 పనులకు సంబంధించి రూ.77.57 కోట్లు నిధులు మంజూరయ్యాయి. మందస మండలంలో 25 పనులకు రూ.10కోట్లు, కొత్తూరులో 21 పనులకు రూ.10.15 కోట్లు, హిరమండలం మండలంలో 15 పనులకు గాను రూ.16.12 కోట్లు మంజూరు చేశారు. వీటితో పాటు బూర్జ మండలానికి 4, సరుబుజ్జిలి 2, సారవకోట 5, టెక్కలి 2, నందిగాం 4, కంచిలి 5, పలాస మండలానికి 4 పనులు మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే, నిధులు మంజూరు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. రికార్డుల్లో మాత్రం పూర్తయినట్లు అధికారులు చూపిస్తున్నారు. పక్కజిల్లా పార్వతీపురం మన్యంలో పూర్తి స్థాయిలో పనులు జరిగినా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టకపోవడంపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇంజనీరింగ్ అధికారుల సమన్వయం లోపంతోనే పనులు ముందుకు కదలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ శాఖలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అన్ని పనులకు ఈఈ స్థాయిలో అనుమతులు వచ్చే విధంగా అంచనాలు తయారు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్క పనికి రూ.40 లక్షలు దాటకుండా అంచనాలు తయారు చేశారు. రూ.40 లక్షలు అంచనాలు దాటితే ఈఎన్‌సీ అనుమతులు పొందాలనే ఉద్దేశంతో అలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ అధికారిపై చర్యలేవి?
పాతపట్నం నియోజకవర్గంలో అధికంగా పనులను ఇంజనీరింగ్‌శాఖలో పనిచేస్తున్న ఒక అధికారే చేయిస్తున్నారు. దీంతో పనుల్లో నాణ్యత కొరవడింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. పనులు నాణ్యతగా లేకపోవడంతో క్వాలిటీకంట్రోల్ అధికారులు ఇటీవల పరిశీలించారు. అయితే, ఇంతవరకు ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బయట నుంచి వచ్చిన వ్యక్తులకే అధికంగా పనులు ఇవ్వడంతో వారు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు రోడ్డు పనులు పూర్తి చేసేలా కలెక్టర్, పీవో చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
ప్రమాదాలు జరుగుతున్నాయి
రెండు నెలల కిందట పోలూరు నుంచి రాజపురం వరకు సుమారు 4 కిలో మీటర్ల రోడ్డును తవ్వేసి వదిలేశారు. ఇంతవరకు పనులు పూర్తి చేయలేదు. గతంలో ఉన్న రహదారిని తవ్వేయడంతో రాళ్లు తేలి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రోడ్డు పనులు పూర్తి చేయాలి.
-లుగలాపు భాస్కరరావు, మాజీ సర్పంచ్, ధీనబందుపురం
బిల్లులు కావడం లేదు..
రహదారుల పనులు పూర్తికాకపోవడం వాస్తవమే. చేసిన పనులకు బిల్లులు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులను ప్రభుత్వానికి పంపించాం. నిధులు వచ్చిన వెంటనే మళ్లీ పనులు ప్రారంభిస్తాం.
రమాదేవి, ఈఈ సీతంపేట