గంజాయి వ్యాపారుల బరితెగింపు
ABN , Publish Date - Jan 08 , 2025 | 01:42 AM
ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా గంజాయి స్మగ్లర్లు బరితెగించిపోతున్నారు. గంజాయి రవాణాపై ముందస్తు సమాచారం అందుకున్న నందిగామ డివిజన్ పోలీసులు మంగళవారం పకడ్బంధీ వ్యూహం పన్నినా వ్యాపారులు తప్పించుకొని పారిపోగా వాహనాలను మాత్రం పట్టుకోగలిగారు. మహారాష్ట్ర రిజిస్ర్టేషన్ కారులో మాదకద్రవ్యాలు రవాణా అవుతున్నాయనే సమాచారంతో తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించిన కారు కీసర టోల్‌ప్లాజా బార్‌ను ఢీకొని తనిఖీలు చేస్తున్న పోలీసుల మీదకు రావటంతో వారు అప్రమత్తమై ప్రమాదం నుంచి బయట పడ్డారు.
- ఆపబోయిన పోలీసులు,
- టోల్‌ప్లాజా గేటును ఢీకొట్టి పరారీ
- కొంతదూరం వెళ్లాక గంజాయితో సహా కారు వదిలేసి జంప్
- ఆ వెనుకే మరో వాహనం... అందులోని వారూ పరారీ
- మొదటి కారులో 120 కిలోలు, రెండో దానిలో 80 కిలోల గంజాయి
జగ్గయ్యపేట రూరల్/నందిగామ రూరల్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా గంజాయి స్మగ్లర్లు బరితెగించిపోతున్నారు. గంజాయి రవాణాపై ముందస్తు సమాచారం అందుకున్న నందిగామ డివిజన్ పోలీసులు మంగళవారం పకడ్బంధీ వ్యూహం పన్నినా వ్యాపారులు తప్పించుకొని పారిపోగా వాహనాలను మాత్రం పట్టుకోగలిగారు. మహారాష్ట్ర రిజిస్ర్టేషన్ కారులో మాదకద్రవ్యాలు రవాణా అవుతున్నాయనే సమాచారంతో తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించిన కారు కీసర టోల్‌ప్లాజా బార్‌ను ఢీకొని తనిఖీలు చేస్తున్న పోలీసుల మీదకు రావటంతో వారు అప్రమత్తమై ప్రమాదం నుంచి బయట పడ్డారు. దాంతో డ్రైవర్ కొద్ది దూరం వెళ్లాకైనా పట్టుబడగాననే భయంతో నందిగామ శివారు వైజంక్షన్ సమీపంలోని ఇళ్ల మధ్య కారును వదిలేసి పారిపోయాడు. పోలీసులు హైవేపై, డ్రోన్లతో ఎంత వెతికినా కారు ఆచూకీ దొరకలేదు. ఈ లోగా మహారాష్ట్ర రిజిస్ర్టేషన్ ఉన్న కారు ఉదయం నుంచి ఇళ్ల ప్లాట్‌ల మధ్యలో ఆగి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏసీపీ తిలక్, తహసీల్దార్ సురేష్‌బాబు అక్కడకు చేరుకుని కారులో 120 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసినట్లు ఏసీపీ తిలక్ తెలిపారు. గంజాయి హడావిడి ఉండటంతో ఉదయం నుంచి డ్రోన్‌ల సహాయంతో గాలింపు నిర్వహిస్తూ కారును గుర్తించామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గౌరవరం వద్ద మరో కారు..
జగ్గయ్యపేట మండలంలోని గౌరవరం వద్ద గంజాయి తరలిస్తున్న మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్లలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి వేగంగా వాహనాన్ని వెనుకగా తిప్పుకుని వెళ్తుండటాన్ని గమనించిన పోలీసులు కారును చేజ్ చేయటంతో గౌరవరం వద్ద సర్వీస్ రోడ్డులోకి దిగిన కారు గ్రామంలో నుంచి పొలంలోకి దూసుకెళ్లింది. అక్కడి నుంచి రహదారి లేకపోవటంతో కారు వదిలి పారిపోయారు. పోలీసులు కారును అక్కడ నుంచి చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన కారులో ముగ్గురు వ్యక్తులున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు ఆగగానే దిగి పొలాల్లోకి పారిపోయారని చెప్పారు. డ్రోన్ కెమెరాలతో పహారా చేసినా ఆచూకీ లభించలేదు. కారులోని 80 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.