Share News

Supreme Court: రేషన్‌ కార్డులు కాదు.. పాపులర్‌ కార్డులు!

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:29 AM

అభివృద్ధి సూచీ గురించి అడిగితే.. తలసరి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని రాష్ట్రాలు చెబుతున్నాయి.. అదే సబ్సిడీల విషయానికొస్తే మాత్రం 75 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని అంటున్నాయి..

Supreme Court: రేషన్‌ కార్డులు కాదు.. పాపులర్‌ కార్డులు!

  • తలసరి ఆదాయం పెరుగుతోంది.. అయినా

  • 75% జనాభా దారిద్య్ర రేఖకు దిగువనా?

  • సబ్సిడీలు అనర్హుల జేబులు నింపరాదు: సుప్రీం

న్యూఢిల్లీ, మార్చి 19: ‘అభివృద్ధి సూచీ గురించి అడిగితే.. తలసరి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని రాష్ట్రాలు చెబుతున్నాయి.. అదే సబ్సిడీల విషయానికొస్తే మాత్రం 75ు జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని అంటున్నాయి.. రేషన్‌ కార్డులు పాపులర్‌ కార్డులుగా మారాయి’ అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కార్మిలకు ల సమస్యలను సుమోటో కేసుగా పరిగణించి కోర్టు విచారణ చేపట్టింది. ఆ అంశంపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ‘సబ్సిడీల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకే దక్కాలి. పేదలకు ఉద్దేశించిన రాయితీలు అనర్హుల జేబులను నింపుతున్నాయా అన్నదే మా ఆందోళన. రాష్ట్రాలు మేం ఎన్నో రేషన్‌ కార్డులు జారీచేశామని చెబుతున్నాయి. మీ అభివృద్ధి గురించి చెప్పండని అడిగితే.. కొన్ని రాష్ట్రాలు తమ తలసరి ఆదాయం పెరుగుతోందని చెబుతున్నాయి.


దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి (బీపీఎల్‌) గురించి అడిగితేనేమో.. 75ు బీపీఎల్‌ కు టుంబాలేనని అంటున్నాయి. రెండూ పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. అసలైన లబ్ధిదారులకే ప్రయోజనాలు అందేలా చూడాలి’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. కొందరు దరఖాస్తుదారుల తరఫున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. ప్రజల ఆదాయంలో అసమానతల కారణంగానే ఈ తేడా కనిపిస్తోందని తెలిపారు. ‘ప్రభుత్వ ఈ-శ్రమ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న పేద వలస కూలీలు సుమారు 8 కోట్ల వ రకు ఉన్నారు. వారందరికీ ఉచితం గా రేషన్‌ అందించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. రేషన్‌ కార్డుల జారీలో రాజకీయ ప్రమేయం ఉండదని ఆశిస్తున్నామని అన్నారు. కేం ద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భట్టి స్పందిస్తూ.. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలో 81.35 కోట్ల మందికి కేంద్రం రేషన్‌ అందిస్తోందని తెలిపారు. ఇలాంటి పథకం కిందే మరో 11 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తోందన్నారు. దరిమిలా ఉచిత రేషన్‌ పంపిణీ స్థితిగతులపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదావేసింది.

Updated Date - Mar 20 , 2025 | 04:29 AM