ఇసుక కార్మికుల ఆందోళన ఉద్రిక్తం
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:41 AM
తోట్లవల్లూరులో ఇసుక కార్మికుల ఆందోళన బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ నాయకుల జోక్యంతో మాటామాట పెరిగి తన్నుకునే వరకు వెళ్లింది. టీడీపీ నేత వాసుపై పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే దాడి జరిగింది.
- తోట్లవల్లూరులో మిషన్ లోడింగ్ నిలిపి వేయాలని ధర్నా
- శిబిరం వద్దకు వైసీపీ, టీడీపీ నాయకుల రాకతో ఘర్షణ
- టీడీపీ నేత ఈడే వాసుపై పోలీసులు, అధికారుల సమక్షంలో దాడి
- వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ పెద్దల తెరవెనుక జోక్యంతో జఠిలమవుతున్న వివాదం
తోట్లవల్లూరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
తోట్లవల్లూరులో ఇసుక కార్మికుల ఆందోళన బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ నాయకుల జోక్యంతో మాటామాట పెరిగి తన్నుకునే వరకు వెళ్లింది. టీడీపీ నేత వాసుపై పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే... నార్తువల్లూరు ప్రభుత్వ ఇసుక క్వారీలో మిషన్ లోడింగ్ నిలిపివేసి కార్మికులతో లోడింగ్ చేయించి పని కల్పించాలని తోట్లవల్లూరు రేవులో బుధవారం తెల్లవారుజాము నుంచి ఇసుక కార్మికులు ధర్నాకు దిగారు. తెల్లవారు జామున ఆరు గంటలకు నార్తువల్లూరు క్వారీ నుంచి ఇసుక లోడింగ్‌తో వస్తున్న ఒక లారీని తోట్లవల్లూరు రేవులో ఈడ్పుగంటి కోటేశ్వరరావు, ఈడ్పుగంటి చంటి, పాగోలు రాంబాబు, ఈడ్పుగంటి రాజు, మట్టా సోని, బండ్రపల్లి రమేష్ తదితరుల ఆధ్వర్యంలో 40 మంది కార్మికులు అడ్డుకున్నారు. నదీపాయలో రహదారిపై లారీ ఎదుట టెంట్ వేసి ధర్నాకు కూర్చున్నారు. దీంతో సీఐ చిట్టిబాబు, ఎస్సై అర్జునరాజు, సిబ్బందితో వచ్చి చర్చలు జరిపారు. క్వారీ నిర్వాహకులు వచ్చి సమాధానం చెప్పాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఎవరు చర్చలకు రాకపోవడంతో సాయంత్రం 7.30 గంటల వరకు ధర్నా కొనసాగిస్తునే ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పదిమంది కార్మికులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అర్జీ అందించేందుకు ప్రయత్నిస్తే తహసీల్దార్ కుసుమకుమారి నిరాకరించారని కోటేశ్వరరావు చెప్పారు. దాంతో ధర్నా రాత్రి పొద్దుపోయో వరకు కొనసాగుతూనే ఉంది.
నచ్చజెప్పేందుకు పోలీసుల ప్రయత్నం
మరోవైపు ఏదైనా సమస్య ఉంటే అధికారులకు అర్జీ అందించాలని, లేదా క్వారీ నిర్వాహకులతో చర్చించి పరిష్కరించుకోవాలని, ఇలా వాహనాన్ని అడ్డుకుని ధర్నా చేయటం పద్ధతి కాదని, కేసులు నమోదు చేయాల్సి వస్తుందని సీఐ చిట్టిబాబు కార్మికులకు నచ్చజెపుతున్నా ఫలితం లేకుండా ఉంది. గ్రామంలోని కార్మికులు ధర్నా శిబిరానికి రావాలని రాత్రి మైక్ ప్రచారం చేయించారు. దీంతో ఆందోళన ఏ రూపం దాల్చుతుందో తెలియకుండా ఉంది.
వాస్తవాలు ఇవీ :
నార్తువల్లూరు ప్రభుత్వ క్వారీ పాములలంక సమీపంలో పెద్దఏటిపాయలో ఉంది. ఇక్కడ నుంచి వల్లూరుపాలెం వద్ద అధికారులు పెట్టిన స్టాక్ పాయింట్ ఏడు కిలో మీటర్ల దూరంలో ఉంది. క్వారీ నిర్వాహకులు టన్ను ఇసుక స్టాక్ పాయింట్‌కు తరలించేందుకు రూ.99లకు టెండర్ తీసుకున్నారు. ట్రాక్టర్‌లో మూడు టన్నుల ఇసుక వల్లూరుపాలెం స్టాక్‌పాయింట్‌కు రవాణా చేస్తే క్వారీ నిర్వాహకులకు రూ.297 వస్తాయి. ఇది తీవ్ర నష్టం కలగజేస్తోందని.. పగలు అరకొరగా ఇసుకను స్టాక్‌పాయింట్‌కు తోలి రాత్రి సమయంలో మిషన్ పెట్టి లారీలకు లోడింగ్ చేస్తున్నారు. దీనిని కార్మికులు తమకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందాలనేది అసలు వ్యూహంగా కనిపిస్తోంది. కార్మికులు ఈ క్వారీకి వచ్చి ఇసుక లోడింగ్ చేస్తే రూ.300 చెల్లిస్తారు. దాంతో కార్మికులు రూ.300లకు ఇసుక లోడింగ్ చేసేందుకు ముందుకు రాకుండా తోట్లవల్లూరు పాయలో ఇల్లీగల్ క్వారీ ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్ ఇసుకను రూ.800లకు లోడింగ్ చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. మిషన్‌తో లోడింగ్ చేసుకుంటున్నందుకు రొయ్యూరులో రోజుకు రూ.40 వేలను క్వారీ నిర్వాహకులు పనిచేయకుండానే కార్మికులకు చెల్లిస్తున్నారు. తమకు కూడా రొయ్యూరు ప్యాకేజీ కావాలని, రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించి మిషన్‌తో ఇసుక లోడింగ్ చేసుకోమని కార్మికుల అంతర్గత డిమాండ్‌గా కొందరు చెబుతున్నారు. ఈ డిమాండ్‌ను అధికారుల ముందు ఉంచకుండా మిషన్ లోడింగ్ ఆపి పనికల్పించాలని కార్మికులు కూర్చోవడంతో ఈ సమస్య తెగకుండా ఉంది.
పులుముకున్న రాజకీయరంగు
తోట్లవల్లూరులో బుధవారం ఇసుక కార్మికులు చేపట్టిన ఆందోళనకు రాజకీయరంగు పులుముకుంది. కృష్ణానదీపాయ వద్ద ఇసుక లారీని అడ్డుకుని ఉదయం నుంచి కొనసాగిస్తున్న ఆందోళన రాత్రి 8 గంటల సమయంలో కొట్లాటకు దారితీసింది. కార్మికుల వద్దకు వైసీపీ నేత ఈడ్పుగంటి రూబేను రాగా టీడీపీ వైపు నుంచి వల్లూరుపాలెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఈడే వాసు మరికొందరు వచ్చారు. తహసీల్ధార్ ఎం.కుసుమకుమారి కార్మికులతో మాట్లాడుతుండగా వాసు కల్పించుకుని మీ ప్రభుత్వంలో ఇసుక తోలుకోలేదా, కార్మికులకు పని కల్పించారా అనటంతో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పొరుగూరి నుంచి వచ్చి మాట్లాడటానికి నీకేంపని, మాపై దాడి చేస్తావా అంటు ఆందోళన చేస్తున్న కార్మికులు వాసుపై ఒక్కసారిగా దాడికి దిగారు. చీకట్లో ఎవరిని ఎవరు కొడుతున్నారో తెలియకుండా పోయింది. పోలీసులు వాసుని అతి కష్టంతో విడిపించి బయటకు తీసుకెళ్లారు. తరువాత సీఐ చిట్టిబాబుతో కార్మికులు వాదనకు దిగారు. లారీ ఓనర్ వచ్చేదాక కదిలేది లేదని కార్మికులు చెప్పటంతో తాము చర్యలు తీసుకోవలసి వస్తుందని సీఐ హెచ్చరించారు. సీఐని కూడా మీకేంపని అని కార్మికులు ప్రశ్నించటంతో తహసీల్దార్ ఫిర్యాదు ఇస్తే ఎక్కడికైనా వస్తామని సీఐ చిట్టిబాబు, మేము మీకు ఫిర్యాదు చేయలేదని, ఎందుకొచ్చారని కార్మికులు ఎదురు ప్రశ్నించారు. దీంతో సీఐ టెంట్ తొలగించేందుకు సిద్దపడటంతో కార్మికులు అడ్డుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ఆందోళన కారులను పోలీసులు చెదరకొట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ పెద్దలు తెరవెనుక ఉండి కథ నడిపించటం వల్లే సమస్య జఠిలమయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి కార్మికులకు నష్టం తెచ్చేవిధంగా తయారయింది.