అన్నదాతలకు కేంద్రం శుభవార్త
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:58 PM
ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర కానుకగా అన్నదాతలకు ఇప్పటిదాకా ఏడాదికి అందిస్తున్న రూ.6వేలను 10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థిక సాయం రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర కానుకగా అన్నదాతలకు ఇప్పటిదాకా ఏడాదికి అందిస్తున్న రూ.6వేలను 10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు మూడు విడతల్లో రూ.6వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.10వేలకు పెంచుతున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా రూ.10వేలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. గత నెల రెండో వారంలో పార్లమెంటరీ స్థాయి కమిటీ పీఎం కిసాన సమ్మాన నిధి పథకం కింద ఇస్తున్న రూ.6 వేలను రెట్టింపు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఆ నివేదికను కేంద్రం పరిశీలిస్తున్న తరుణంలోనే పీఎం కిసాన సమ్మాన నిధి మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ప్రధాని నిర్ణయం తీసుకోవడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. పీఎం కిసాన సమ్మాన నిధి పథకాన్ని 2019 నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు.. ఒక్కో వాయిదాకు రూ.2వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది. కొత్త ఏడాది ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన వారిలో ఆనందోత్సాహాలు రేపింది. ఈ పథకం కింద కర్నూలు జిల్లాలో 2,34,853 మంది రైతులు, అదే విధంగా నంద్యాల జిల్లాలో 2.10 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.