Share News

తెగ తాగేశారు..!

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:01 AM

న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ సంబరాలు జోరుగా సాగాయి. ఎటు చూసినా అర్ధరాత్రి బాణసంచాలు కాలుస్తూ, యువకులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

తెగ తాగేశారు..!

24 గంటల్లో రూ.11.50 కోట్ల బిజినెస్‌

మద్యం దుకాణాలు, బార్లు కిటకిట

రికార్డ్‌ స్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు

హుషారుగా న్యూ ఇయర్‌ సంబరాలు

కర్నూలు అర్బన, జనవరి 1(ఆంధ్రజ్యోతి): న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ సంబరాలు జోరుగా సాగాయి. ఎటు చూసినా అర్ధరాత్రి బాణసంచాలు కాలుస్తూ, యువకులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. కొందరుమాత్రం గృహాలకే పరిమితమై ఫుల్‌గా లాగిస్తే, మరికొందరు మాత్రం ఫుల్‌ కిక్కులో బైక్స్‌ రైడ్‌ చేసి పోలీసులకు పట్టుబట్టారు. అయితే న్యూ ఇయర్‌ ఏమో కానీ, మద్యం కొనుగోళ్లు మాత్రం రికార్డు స్థాయిలో సాగాయి. న్యూ ఇయర్‌ వేడుకల్లో మందుబాబులు పండగ చేసుకున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా డిసెంబరు 31 ఒక్క రోజే రూ.11.50 కోట్ల మేర లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. మద్యం ప్రియులు కూడా ముందుగానే పెద్దద ప్లాన వేసి, పార్టీలు జోరుగా సాగించారు. అధికంగా బీర్‌ బాటిళ్ల కొనుగోళ్లకు మద్యం ప్రియులు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. మందుబాబులు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేయడంతో ఎక్సైజ్‌ శాఖకు భారీగానే ఆదాయం వచ్చింది.

మంగళవారం నూతన సంవత్సర వేడుకల కోసం మద్యం అమ్మకాలను ఎక్సైజ్‌ శాఖ అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో దుకాణాల వద్ద మద్యం కోసం యువత, ఇతర వర్గాలతో కిక్కిరిసి కనిపించింది. రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత కొత్త మద్యం పాలసీ అమలు కావడంతో మందుబాబులకు మద్యం తక్కువ ధరల్లో ఎక్కడ పడితే అక్కడి లభ్యమైంది. కూటమి ప్రభుత్వంలో ధరలు తగ్గడంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వేళ్లే మందు బాబులు జిల్లాలోని మద్యం షాపులు, బార్లను ఆశ్రయించారు. ఫలితంగా మద్యం వ్యాపారులు జోరుగా వ్యాపారాలు జగడంతో మద్యం బాబులకు అవసరమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచారు. నూతన సంవత్సర వేడుకలు ఘనంగా చేసుకున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వరకు మద్యం ఏరులై పారింది. మధ్యాహ్నం నుంచే మద్యం దుకాణాల వద్ద క్యూలో నిలబడి మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తూ కనిపించారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది భారీగానే మద్యం అమ్మకాలు జరిపినట్లు ఎక్సైజ్‌ అధికారుల రికార్డులు చెబుతున్నాయి.

ఫ అమ్మకాలతో దుకాణాలు..కిటకిట..

కర్నూలు జిల్లాలో 204 దుకాణాలు, 49 బార్ల ద్వారా రూ. 11.50 కోట్ల మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్‌ అఽధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో 99 దుకాణాలు, 27 బార్ల రూ.6.30 కోట్ల అమ్మకాలు జరగ్గా, నంద్యాల జిల్లాలో 105 మద్యం దుకాణాలు, 22 బార్ల ద్వారా రూ.5.20 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మద్యం దుకాణాలను కొత్త మద్యం పాలసీలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 204 దుకాణాలు టెండర్‌ ప్రక్రియ ద్వారా ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మకాలను కట్టబెట్టంది. గత ఏడాది అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 192 దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలను ప్రభుత్వమే ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి సాగించింది. 2023 డిసెంబరు 31వ తేదీ రూ.7.33 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది ప్రైవేట్‌ మద్యం అమ్మకాల ద్వారా భారీ ఎత్తున అమ్మకాలు జరిగాయి. నంద్యాల, ఆదోని, డోన, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు పట్టణాల్లో కూడా గతంలో కంటే అమ్మకాలు భారిగా జరిగాయి. ఇక బార్లు కూడా కిక్కిరిసి కనిపించాయి. ఉమ్మడి జిల్లాలోని 49 బార్లలో కూడా రాత్రి అమ్మకాలు జోరుగా సాగాయి.

ఫ మందుబాబుల హల్‌చల్‌!

జిల్లాలోని నగరంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. కర్నూలు నగరంలో మందుబాబులు తప్పతాగి చిందులేశారు. రోడ్లపై బైక్‌లతో చక్కర్లు కొట్టారు. బైక్‌ల సైలెన్సర్లను తొలగించి రైజ్‌ చేస్తూ భారీ శబ్ధాలతో కేకలు వేస్తూ కనిపించారు. బాణసంచా పేలుస్తూ వేడుకలు నిర్వహించుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పోలీసుల అంక్షలు అమలులో ఉన్నప్పటికీ యువత పట్టించుకోలేదు. కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్‌ నుంచి బళ్లారి వెళ్లే రహదారి, వెంకటరమణ కాలనీ, పాతబస్తి, నంద్యాల చెక్‌ పోస్టు పరిధిలోని జోహరాపురం రోడ్డులో యువత చిందులేస్తూ, బైక్‌లపై విన్యాసాలు చేశారు. అయితే పలు చోట్ల ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి కొందరు గాయాలపాలయ్యారు.

Updated Date - Jan 02 , 2025 | 12:01 AM