Severe Weather Hits AP Mango Farmers Suffer Heavy Losses: నేడూ పలు ప్రాంతాల్లో వర్షాలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:30 AM
రాష్ట్రంలో పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. ఈదురు గాలులు కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో మామిడి రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు
అమరావతి, విశాఖపట్నం, తిరువూరు, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బుధవారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రాత్రి 8గంటల వరకు అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5, తిరుపతి జిల్లా పూలతోటలో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పగలు కర్నూలులో 40.7, నంద్యాల జిల్లా గోస్పాడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఈదురు గాలులకు ఎన్టీఆర్ జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. 15రోజుల్లో 4సార్లు ఈ దురు గాలులు సృష్టించిన బీభత్సానికి 60శాతం మామిడి కాయలు నేలరాలగా, మంగళవారం అర్ధరాత్రి వీచిన గాలులకు మరో 20 శాతం కాయలు రాలిపోయాయి.