Share News

Anantapur Accident: అక్కాచెల్లెళ్లను మింగేసిన అతివేగం!

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:52 AM

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామ సమీపాన ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. మృతుల్లో సరస్వతి (34), నీలావతి(45), యోగేశ్వరమ్మ (40) సొంత అక్కచెల్లెళ్లు.

Anantapur Accident: అక్కాచెల్లెళ్లను మింగేసిన అతివేగం!

ముగ్గురు అక్కాచెల్లెళ్లు సహా పసికందు దుర్మరణం

అదే కుటుంబంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

కూడేరు, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మూణ్నెల్ల క్రితం కాన్పు కోసం వచ్చిన చెల్లెలు పండంటి బిడ్డను ప్రసవించింది. నామకరణం కూడా పూర్తయింది. బిడ్డతో సహా చెల్లెల్ని తిరిగి ఆమె అత్తవారింటికి సాగనంపడానికి ఆమె ఇద్దరు అక్కలు, వారి పిల్లలు ఆటోలో సంతోషంగా బయలుదేరారు. అయితే మృత్యువు కారు రూపంలో వచ్చి ముగ్గురు అక్కాచెల్లెళ్లు సహా పసికందును బలితీసుకుంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామ సమీపాన ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. మృతుల్లో సరస్వతి (34), నీలావతి(45), యోగేశ్వరమ్మ (40) సొంత అక్కచెల్లెళ్లు. సరస్వతి కుమార్తె మూడు నెలల వయసున్న విద్యశ్రీ కూడా మృతిచెందింది. ఆటో డ్రైవర్‌ లోకేశ్‌, మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కూడేరు పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన బసవరాజు, పార్వతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు పుష్పావతి, నీలావతి, యోగేశ్వరమ్మ, సరస్వతి సంతానం.


నాలుగో కుమార్తె సరస్వతికి జిల్లాలోని ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన సతీ్‌షకుమార్‌తో వివాహమైంది. ఆమె మూడు నెలల క్రితం కాన్పు నిమిత్తం పుట్టింటికి వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడా పాప(విద్యశ్రీ)కు మూడు నెలలు. ఆదివారం తిరిగి అత్తవారి గ్రామానికి సరస్వతి బయల్దేరింది. ఆమె వెంట నీలావతి, యోగేశ్వరమ్మ, వారి పిల్లలు అచ్యుత్‌కుమార్‌, జ్ఞానేశ్వరి కూడా రాయంపల్లికి చెందిన లోకేశ్‌ ఆటోలో బయల్దేరారు. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సమీపంలోకి రాగానే ఉరవకొండ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో బాలింత సరస్వతి అక్కడికక్కడే మృతిచెందింది. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి విద్యశ్రీ, నీలావతి, యోగేశ్వరమ్మ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన లోకేశ్‌, అచ్యుత్‌కుమార్‌, జ్ఞానేశ్వరి చికిత్స పొందుతున్నారు. కారులో ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉండగా, వారిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజు తెలిపారు.

Updated Date - Mar 03 , 2025 | 01:52 AM