Kinjarapu Ram Mohan Naidu: కార్మికులకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భరోసా..
ABN , Publish Date - Apr 18 , 2025 | 08:55 PM
మస్కట్‌లో చిక్కుకున్న కార్మికులకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.
Kinjarapu Ram Mohan Naidu: శ్రీకాకుళం జిల్లా నుండి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించారు. మస్కట్‌లో NASEEM AL SALAM కంపెనీ చేత పని లేకుండా, జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం కార్యాలయం నుండి వీడియో కాల్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు.
కార్మికులు తమ సమస్యలను కేంద్ర మంత్రికి వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడుతామని వారికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే కార్మికుల కుటుంబాలు ఏమాత్రం అధైర్య పడొద్దని, ప్రభుత్వం తరపున కార్మికులకి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కాగా, పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన 9 మంది వలస కూలీలు ఒమన్ రాజధాని మస్కట్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము మస్కట్కి వెల్డింగ్ పనిమీద వచ్చామని, అయితే తాము ఇక్కడకి వచ్చిన తరువాత క్లీనింగ్ చేయమని చెబుతున్నారని, తమ ఏజెంట్లు ఇక్కడ పని ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తమకు కనీసం ఫుడ్ కూడా లేదని వాపోయారు. తాము వచ్చినప్పటి నుంచి ఏజెంట్లకు సమస్యలు చెప్తున్నా పట్టించుకునే నాధుడు లేడని, ఇప్పుడు తామంతా నడిరోడ్డున పడ్డామని, డబ్బులు కట్టాలంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.
Also Read:
SC Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
Satellite Based Toll: మే 1 నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ విధానంపై కేంద్రం క్లారిటీ