Share News

ఉమ్మడి జిల్లాలో 1,139 టీచర్‌ పోస్టులు

ABN , Publish Date - Apr 20 , 2025 | 01:08 AM

నిరుద్యోగ ఉపాధ్యాయులకు తీపికబురు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రభుత్వం శనివారం రాత్రి విడుదల చేసింది.

ఉమ్మడి జిల్లాలో 1,139 టీచర్‌ పోస్టులు

  • ఎస్జీటీ 574, స్కూల్‌ అసిస్టెంట్‌ 560, జువెనైల్‌ పాఠశాలల్లో 5 ఖాళీలు

  • డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల

  • నేడు నోటిఫికేషన్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):

నిరుద్యోగ ఉపాధ్యాయులకు తీపికబురు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రభుత్వం శనివారం రాత్రి విడుదల చేసింది. గత ఏడాది సీఎంగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టీచర్ల నియామకాలకు చేసిన తొలి సంతకం చేశారు. అన్ని అడ్డంకులు తొలగిన తరువాత ఇప్పుడు షెడ్యూల్‌ జారీచేశారు. నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదల చేయనున్నారు. దీని ప్రకారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మునిసిపల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో అన్ని కేటగిరీలు కలిపి 1,139 ఖాళీలు భర్తీ చేస్తారు. వీటిలో 574 సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ పోస్టులు, 560 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, జువెనైల్‌ సంక్షేమ పాఠశాలల్లో ఐదు పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు జోన్‌-1 (ఉత్తరాంఽధ్రలో పాత మూడు జిల్లాలు కలిపి)లో అన్ని రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో అన్ని కేటగిరీలు కలిపి 400 పోస్టులు భర్తీ చేస్తారు.

560 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో 560 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మునిసిపల్‌ పాఠశాలల్లో 495, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 65 ఖాళీలు ఉన్నాయి. వీటిలో తెలుగు 33, హిందీ 39, ఇంగ్లీష్‌ 55, గణితం 66, భౌతికశాస్త్రం 63, జీవశాస్త్రం 58, సాంఘిక శాస్త్రం 96, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 139 ఉన్నాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఖాళీలు మైదానంలో అన్ని యాజమాన్యాల పరిధిలో 239, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 335 ఖాళీలు ఉన్నాయి. మైదానం కంటే ఏజెన్సీలోనే ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయని గుర్తించారు. కాగా నగరంలో జువెనైల్‌ సంక్షేమ శాఖ పరిధిలో బాలల కౌమార పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులు నాలుగు, స్కూలు అసిస్టెంట్‌ పోస్టు ఒకటి వెరసి ఐదు ఉన్నాయి.

Updated Date - Apr 20 , 2025 | 01:08 AM