5,74,905
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:54 AM
జిల్లాలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య దాదాపు ఆరు లక్షలకు చేరింది.
ఇదీ జిల్లాలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య
ఐటీ, అనుబంధ రంగాల కోర్సులు
చేసినవారు 2,59,275 మంది
డిగ్రీలో కామర్స్ పట్టభద్రులు 14,645 మంది
ఆర్ట్స్ పట్టభద్రులు 10,965 మంది
ఇతర సబ్జెక్టులు చదివిన పట్టభద్రులు 55,937 మంది
ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివిన వారు: 1,31,413
వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసినవారు: 45,372
నిరక్షరాస్యులు, ఇతరులు 20,663 మంది
సచివాలయ ఉద్యోగుల సర్వేలో వెల్లడి
నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య దాదాపు ఆరు లక్షలకు చేరింది. ఇందులో ఐటీ అనుబంధ రంగాలతో పాటు ఇంజనీరింగ్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసినవారు, నిరక్షరాస్యులు ఉన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచడం, శిక్షణ అందించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గుచూసే వారిని గుర్తించడానికి గత నెలలో సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే చేశారు.
సర్వేలో జిల్లాలో 19 నుంచి 50 ఏళ్లలోపు 6,31,260 మంది నుంచి వివరాలు సేకరించారు. దీనికి పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఎలాంటి ఉపాధి లేనివారు 10,361 మంది ఉన్నారని గుర్తించగా, ఐటీ, అనుబంధ రంగాల కోర్సులు, డిగ్రీలు చేసినవారు 3,15,630 మంది ఉన్నారని తేల్చారు. ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నవారు 56,355 మంది, ఏ ఉద్యోగమూ లేని వారు 2,59,275 మంది ఉన్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి అర్హత ఉండి ఉపాధి లేని వారి సంఖ్య 26,094, పదో తరగతి పూర్తిచేసినవారు 51,907, ఇంటర్ చదివినవారు 53,412, డిప్లమో చేసినవారు 21,222 మంది ఉన్నారు. డిగ్రీలో కామర్స్ పట్టభద్రులు 14,645 మంది, ఆర్ట్స్ పట్టభద్రులు 10,965 మంది, ఇతర సబ్జెక్టులు చదివిన పట్టభద్రులు 55,937 మంది, వైద్య విద్య పూర్తిచేసినవారు 519, న్యాయ పట్టభద్రులు 479, పీజీ చదివినవారు 22,589 మంది, పీహెచ్‌డీ తీసుకున్న 563 మంది, ఇతరులు 10,302 మంది ఏ ఉపాధి లేని వారిగా గుర్తించారు.
నగరంలోనే అధికం...
ఉపాధి లేని వారిలో అధిక శాతం నగరంలోనే ఉన్నారు. గ్రామీణ మండలాల్లో తక్కువ మంది ఉన్నారని తేలింది. ఇదిలావుండగా ఏ ఉపాధీ లేని వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తగిన విద్యార్హతలున్నవారికి ఇంటి నుంచే (వర్క్‌ఫ్రమ్ హోమ్) పనిచేసేలా వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తోంది. కాగా నైపుణ్యం పెంచుకుని, ఉపాధి పొందడానికి, ఇళ్ల నుంచి పనిచేయడానికి అధికశాతం మంది మొగ్గుచూపుతున్నారు. వీరిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది.