Share News

టెన్త్‌లో 89.14% పాస్‌

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:29 AM

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విశాఖ జిల్లా 89.14 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది 91.15 శాతంతో ఎనిమిదో స్థానంలో నిలవగా, ఈ సంవత్సరం 2.01 శాతం (89.14ు) తగ్గినా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఉత్తీర్ణతలో బాలురు కంటే బాలికలు ముందంజలో ఉన్నారు.

టెన్త్‌లో 89.14% పాస్‌

రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో

విశాఖపట్నం జిల్లా

గత ఏడాది కంటే

ఉత్తీర్ణత 2 శాతం తగ్గినా మెరుగైన స్థానం

పరీక్షలకు హాజరైనవారు 28,435 మంది

ఉత్తీర్ణులైనవారు 25,346...

బాలికలదే పైచేయి

21,833 మందికి ప్రథమ శ్రేణి,

2,367 మందికి ద్వితీయ శ్రేణి

1,147 మందికి తృతీయశ్రేణి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి):

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విశాఖ జిల్లా 89.14 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది 91.15 శాతంతో ఎనిమిదో స్థానంలో నిలవగా, ఈ సంవత్సరం 2.01 శాతం (89.14ు) తగ్గినా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఉత్తీర్ణతలో బాలురు కంటే బాలికలు ముందంజలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 28,435 మంది పరీక్షలకు హాజరుకాగా 25,346 మంది (89.14 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 15,040 మందికిగాను 13,288 మంది (88.32 శాతం), బాలికలు 13,390 మందికిగాను 12,058 (90.05 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

రాష్ట్రస్థాయిలో పార్వతీపురం మన్యం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా, విశాఖపట్నం జిల్లా మూడో స్థానం సాధించింది. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 21,833 మంది ప్రథమ శ్రేణి సాధించగా, 2,367 మంది ద్వితీయశ్రేణి, 1,147 మంది తృతీయ శ్రేణిలో పాసయ్యారు.

మెరుగైన స్థానం

జిల్లాల విభజన తరువాత 2023లో 82.68 శాతంతో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలవగా, 2024లో 91.15 శాతానికి ఉత్తీర్ణత పెరిగినా ఎనిమిదో స్థానానికి దిగజారింది. అయితే గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత ఫలితాల్లో ఉత్తీర్ణత తగ్గినా 2023 మాదిరిగానే మూడో స్థానం సాధించింది.

టాప్‌ 20లో నలుగురు విశాఖ బాలికలు

600 మార్కులకు అత్యధికంగా అంటే 599, 598 మార్కులు సాధించిన 20 మందిలో నలుగురు విశాఖకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఆ నలుగురూ బాలికలే కావడం విశేషం. ఎంవీపీ కాలనీలోని భాష్యం పాఠశాలలో చదివే ఆళ్ల లలిత, పెందుర్తి నారాయణ స్కూలు విద్యార్థిని నారాయణశెట్టి సాయి తన్విలు 599 మార్కులు తెచ్చుకున్నారు. బక్కన్నపాలెం శ్రీచైతన్య ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల విద్యార్థిని బొడ్డు హృదయ శాంతి, పెందుర్తి శ్రీచైతన్య పాఠశాల విద్యార్థిని అబ్దుల్‌ సమీర భాను 598 మార్కులు సాధించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 593 మార్కులతో

వేపగుంట బాలిక టాప్‌

ప్రభుత్వ పాఠశాలలల విద్యార్థులు మార్కుల సాధనలో ప్రతిభ చూపారు. వేపగుంట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఇండిగ వేద 593 మార్కులతో జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో టాపర్‌గా నిలిచింది. భీమిలి ఏపీ రెసిడెన్సియల్‌ బాలిక రెడ్డి భవ్యశ్రీ 592, నరవ జడ్పీ పాఠశాల బాలిక రెడ్డి సౌజన్య, నగరంలోని జ్ఞానానికేతన్‌ ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థి డబ్బీరు సాయిచరణ్‌ 592 మార్కులు సాధించారు.

Updated Date - Apr 24 , 2025 | 01:29 AM