Share News

సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:35 PM

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు బాధ్యులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను హెచ్చరించారు.

సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
మీకోసం కార్యక్రమంలో ప్రజల సమస్యలను వింటున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరిక

మీకోసంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

జిల్లాలో 15 శాతం వృద్ధి రేటుకు ప్రణాళికలు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదని సూచన

ఫిర్యాదు రాకుండా పనిచేయాలని ఆదేశం

పాడేరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు బాధ్యులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను హెచ్చరించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అలాగే ప్రభుత్వం మీకోసం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి ప్రతికూల ప్రతిస్పందన వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. అలాగే సచివాలయం పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై ప్రజలు జిల్లా కేంద్రం వరకు రాకూడదన్నారు. వాటిని సచివాలయం స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. అలాగే జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ప్రాఽథమిక రంగాల్లో పురోగతి సాధించాలన్నారు. అలాగే ఖరీఫ్‌, రబీ సీజన్లలో సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు రాకుండా పక్కాగా పనిచేయాలన్నారు.

మీకోసంలో 115 వినతులు

ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసంలో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 115 వినతులను స్వీకరించారు. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ కర్రిముకిపుట్టు నుంచి చెరువువీధి వరకు రోడ్డు నిర్మించాలని వి.భీమలింగం అనే వ్యక్తి కోరారు. అలాగే పాడేరు మండలం మినుములూరు సర్పంచ్‌ లంకెల చిట్టమ్మ పంచాయతీలోని సల్దిగెడ్డ వంతెన, రోడ్డు పనులను పూర్తి చేయాలని కోరగా.. పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పరిధిలోని పంగళం, సంపంగిబంధ గ్రామాలకు రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు జి.మాణిక్యం, పి.గోపాల్‌, పి.బాలకృష్ణ తదితరులు కోరారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్‌(టీడబ్ల్యూ), జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నంద్‌, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు కె.వేణుగోపాల్‌, జి.డేవిడ్‌రాజు, టీడబ్ల్యూ డీడీ ఎల్‌.రజని, రోడ్ల, భవనాల శాఖ ఈఈ బాల సుందరబాబు, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, సర్వే విభాగం ఏడీ దేవేంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:35 PM