Share News

రహదారి కోసం ఆందోళన

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:16 PM

ర్వీనగర్‌- పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం జంక్షన్‌(హనుమాన్‌ జంక్షన్‌) నుంచి ధారకొండ వరకు రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

రహదారి కోసం ఆందోళన
నిరసన ర్యాలీలో పాల్గొన్న గిరిజనులు

ఐదు పంచాయతీల గిరిజనుల నిరసన ర్యాలీ

సీలేరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఆర్వీనగర్‌- పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం జంక్షన్‌(హనుమాన్‌ జంక్షన్‌) నుంచి ధారకొండ వరకు రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలంటూ నినాదాలు చేస్తూ ధారకొండలో మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వాలు, అధికారులు ఆర్వీనగర్‌- పాలగెడ్డ రహదారి నిర్మాణంపై నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని, కూటమి ప్రభుత్వ హయాంలోనైనా ఈ రోడ్డుకు మోక్షం కలుగుతుందనుకుంటే ఇప్పటి వరకు పనులు చేపట్టలేదన్నారు. ఇప్పటికే ఈ రహదారి పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా ఉందని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎప్పుడు రాకపోకలు నిలిచిపోతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులను ప్రారంభించకపోతే వారం రోజుల్లో మండల స్థాయిలో బంద్‌ నిర్వహించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే గత సెప్టెంబరు 8న భారీ తుఫాన్‌కు కొట్టుకుపోయిన గంగవరంఅగ్రహారం, చోడిరాయి, మాదిమళ్లు వంతెన మరమ్మతులను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఽసీలేరు, ధారకొండ, గుమ్మిరేవుల, దుప్పులవాడ, గాలికొండ పంచాయతీలకు చెందిన నాయకులు కారే శ్రీనివాస్‌, మల్లు దొర, సొన్ను, బాకూరి కోటేశ్వరరావు, అల్లంకి రాజు, బాబూరావు, జనసేన నాయకుడు సిదార్థమార్క్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:16 PM