వైసీపీకి పరాభవం
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:24 AM
వైసీపీకి పరాభవం
ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్‌పై వీగిన అవిశ్వాస తీర్మానం
రమాకుమారిని పదవి నుంచి దించే విషయంలో బెడిసికొట్టిన వ్యూహం
గత నెలలో అవిశ్వాస నోటీసుపై 19 మంది కౌన్సిలర్లు సంతకాలు
ఈ నెల 22న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ ప్రకటన
తెరవెనుక చక్రం తిప్పిన విశాఖ డెయిరీ చైర్మన్ ఆనంద్‌కుమార్
వైసీపీలో చీలిక.. ఆరుగురు కౌన్సిలర్లు ఊటీ శిబిరానికి తరలింపు
బలం లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం సమావేశానికి వైసీపీ గైర్హాజరు
తీర్మానం వీగిపోయినట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటన
కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు
ఎలమంచిలి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారిపై వైసీపీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి అసవరమైనంత మంది సభ్యులు లేకపోవడంతో వైసీపీ కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో చైర్‌పర్సన్ పదవిపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. రమాకుమారి పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
మునిసిపల్ పాలకవర్గంలో వైసీపీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు, చైర్‌పర్సన్ రమాకుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ గత 26వ తేదీన జిల్లా కలెక్టర్, ఆర్డీఓతోపాటు మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజుకు నోటీసు అందజేశారు. దీంతో ఈ నెల 22వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం నర్సీపట్నం ఆర్డీఓ వి.వి.రమణ ప్రిసైడింగ్ అధికారి హోదాలో మునిసిపల్ కార్యాలయం ఆవరణలో కమిషనర్ ప్రసాదరాజుతో కలిసి ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ ధనుంజయరావు పర్యవేక్షణలో మునిసిపల్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభమైన తరువాత 30 నిమిషాల వరకు ఒక్క కౌన్సిలర్ కూడా రాలేదు. దీంతో ప్రిసైడింగ్ అధికారి సమావేశాన్ని రెండు గంటలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు. ఈసారి కూడా కౌన్సిలర్లు ఎవరూ రాకపోవడంతో చైర్‌పర్సన్ రమాకుమారిపై వైసీపీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు ప్రిసైడింగ్ అధికారి రమణ ప్రకటించి సమావేశాన్ని ముగించారు. అప్పటికే బయట వేసివున్న కూటమి నాయకులు, చైర్‌పర్సన్ వర్గీయులు ఆనందం వ్యక్తం చేశారు.
చక్రం తిప్పిన విశాఖ డెయిరీ చైర్మన్
చైర్‌పర్సన్ రమాకుమారిపై వైసీపీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ తెరవెనుక చక్రం తిప్పారు. అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసిన వారిలో కొంతమందిని చైర్‌పర్సన్ గూటికి రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకుగాను 23 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. దీంతో పిళ్లా రమాకుమారిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వున్నంతకాలం అంతా సాఫీగానే సాగింది. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చైర్‌పర్సన్ రమాకుమారితోపాటు ఆమె సోదరుడు, విశాఖ డెయిరీ చైర్మన్ అయిన ఆడారి ఆనంద్‌కుమార్, వారి వర్గీయులు బీజేపీలో చేరారు. పార్టీని వీడిని రమాకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి, పదవి నుంచి దించేయాలన్న వైసీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ గత నెల 26వ తేదీన 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీవోకు, స్థానిక మునిసిపల్ కమిషనర్‌కు నోటీసులు అందజేశారు. కౌన్సిలర్ల సంతకాలు ధ్రువీకరించుకున్న తరువాత అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 22 వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది (17) మద్దతు తెలిపాలి. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేసేందుకు విశాఖ డెయిరీ చైర్మన్ ఆనంద్‌కుమార్ తెరవెనుక ఉండి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసిన కౌన్సిలర్లలో ఆరుగురిని తమవైపునకు తిప్పుకుని ఊటీకి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ పెద్దలు, వారిని వెనక్కు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గదని నిర్ధారించుకుని, సమావేశానికి గైర్హాజరయ్యారు.