నిస్తేజంగా అగ్నిమాపక కేంద్రాలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:26 AM
జిల్లాలో అగ్నిమాపక శాఖ పరిస్థితి దయనీయంగా ఉంది. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత వెంటాడుతోంది. కాలం చెల్లిన వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఇక పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఫైర్ స్టేషన్లను పెంచకపోవడంతో ఉన్న వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న అగ్నిమాపక శాఖ ఈ వేసవికి ఎలా సన్నద్ధమైందోననే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది.
నగరంలో ఉన్నది నాలుగే...
జనాభా ప్రాతిపదికన చూస్తే ఉండాల్సింది 44
వేధిస్తున్న సిబ్బంది కొరత
వాహనాల నిర్వహణకు నిధుల సమస్య
తరచూ మరమ్మతులు
రిపేరుకి నోచుకోక మూలకు చేరిన
రెస్క్యూ టెండర్
కాలం చెల్లిన మిస్ట్ జీపులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అగ్నిమాపక శాఖ పరిస్థితి దయనీయంగా ఉంది. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత వెంటాడుతోంది. కాలం చెల్లిన వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఇక పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఫైర్ స్టేషన్లను పెంచకపోవడంతో ఉన్న వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న అగ్నిమాపక శాఖ ఈ వేసవికి ఎలా సన్నద్ధమైందోననే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది.
జిల్లాలో పెదగంట్యాడ, మర్రిపాలెం, సూర్యాబాగ్, చిట్టివలసల్లో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక అగ్నిమాపక కేంద్రం (ఫైర్ స్టేషన్) ఉండాలి. ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే నష్టతీవ్రత పెరగకుండా ఉండేందుకు ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుకున్న పది నిమిషాల్లోపే ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటం (ఫైర్ టెండర్) చేరుకోవాలి. అంతకంటే ఎక్కువ సమయం పడితే నష్టం పెరిగే ప్రమాదం ఉంటుంది. దీని ప్రకారం చూస్తే 22 లక్షల మంది జనాభా ఉన్న విశాఖ నగరంలో 44 ఫైర్ స్టేషన్లు ఉండాలి. కానీ కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. అవి కూడా దశాబ్దాల కిందట ఏర్పాటుచేసినవే కావడంతో కొత్తగా ఆరు ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఉన్న నాలుగు కేంద్రాల్లో సూర్యాబాగ్, పెదగంట్యాడ, మర్రిపాలెంలో మూడు చొప్పున అగ్నిమాపక శకటాలు (ఫైర్ టెండర్లు) ఉండగా, చిట్టివలసలో మాత్రం ఒక్కటే ఉంది. ఇవికాకుండా ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినట్టయితే అందులో చిక్కుకున్న వారిని రక్షించడం, మంటలను అదుపుచేయడం కోసం హైడ్రాలిక్ బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనం ఒకటి ఉంది. అలాగే భవనాలు కూలిపోయినప్పుడు శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు వీలుగా ఐరన్, కాంక్రీట్ కటింగ్ చేసే రెస్క్యూ టెండర్ వాహనం ఒకటి సూర్యాబాగ్‌లోని ఫైర్ స్టేషన్‌లో ఉంది.
గాజువాకలోని ఆటోనగర్‌లో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో అక్కడ తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడి నుంచి ప్రమాదం జరిగిందని సమాచారం అందితే పెదగంట్యాడ లేదా మర్రిపాలెం నుంచి అగ్నిమాపక శకటం వెళ్లాలంటే అరగంటకుపైగా సమయం పడుతుంది. ఆలోగా మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించేస్తాయి. అందుకే ఆటోనగర్‌లో ఒక అద్దె భవనంలో టెంపరరీ ఫైర్ స్టేషన్‌ను అందుబాటులో ఉంచారు. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా అగ్ని ప్రమాదాలకు సంబంధించి 484 ఫోన్ కాల్స్ ఫైర్‌స్టేషన్లకు అందాయి. వీటిలో 90 శాతం ప్రమాదాలు పెద్దగా ఆస్తినష్టం లేనివి కాగా 45 ప్రమాదాలు మాత్రం ఆస్తినష్టం కలిగించాయి. మరో రెండు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
సమస్యలతో సతమతం
ఫైర్ స్టేషన్లన్నీ సమస్యలతో సతమతమవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 115 మంది సిబ్బంది పనిచేస్తుండగా, ఉద్యోగ విరమణల కారణంగా ఖాళీ అయిన 60 పోస్టులను భర్తీచేయలేదు. దీంతో ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం పడుతోంది. అలాగే వాహనాల నిర్వహణకు ప్రభుత్వం సరిగా నిధులు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఎన్‌జీవోల సహాయంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైర్ స్టేషన్‌లో శకటాలను నీటితో నింపే సదుపాయం లేకపోవడంతో సమీపంలోని జీవీఎంసీ వాటర్ పంప్‌హౌస్‌లు, ప్రమాదాలు జరిగినప్పుడు సమీపంలోని చెరువులు, బావుల నుంచి మోటార్లతో ట్యాంకులు నింపుకోవాల్సి వస్తోంది. భవనాలు కూలిపోయినప్పుడు శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు వీలుగా సిమెంట్ కాంక్రీట్, ఐరన్ కటింగ్ చేసేందుకు కేటాయించిన రెస్క్యూ శకటం కాలం చెల్లినది కావడంతో మరమ్మతులకు గురైంది. రిపేరు చేయించడానికి నిధుల్లేకపోవడంతో ఆ వాహనం చాలాకాలంగా మూలనపడి ఉండిపోయింది. ఇవికాకుండా సందుల్లో జరిగే అగ్ని ప్రమాదాలను నియంత్రించేందుకు, ప్రముఖులు నగర పర్యటనకు వచ్చినప్పుడు కాన్వాయ్‌లో ఉంచడానికి, ఉత్సవాలు, జాతరలు జరిగినపుడు ప్రమాదం జరిగితే సకాలంలో ఆర్పేందుకు అవసరమైన మిస్ట్ జీపులు దశాబ్దం కిందటివి కావడంతో వాటి సామర్థ్యం తగ్గిపోయింది.
ఉన్న సిబ్బందితోనే సమర్థంగా విధులు
ఎస్.రేణుకయ్య, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి.
జిల్లాకు కొత్తగా మూడు అగ్నిమాపక కేంద్రాలు మంజూరయ్యాయి. ఐటీ అభివృద్ధి నేపథ్యంలో ఎండాడలో ఒకటి, మధురవాడ వైపు నగరం విస్తరిస్తుండడంతో కాపులుప్పాడలో ఒకటి, సింహాచలం క్షేత్రానికి భక్తులు రద్దీ పెరుగుతుండడం, తరచూ ఉత్సవాల నిర్వహణ జరుగుతుండడంతో సింహపురి లేఅవుట్‌లో ఒకటి ఏర్పాటుచేయబోతున్నాం. వాటికి నిధులు మంజూరు, టెండర్ ప్రక్రియ కూడా పూర్తవ్వడంతో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఉన్న సిబ్బంది, వనరులతోనే సమర్థంగా విధులు నిర్వరిస్తున్నాం. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే 101 నంబర్‌కు మాత్రమే డయల్ చేయాలి. దీనివల్ల సమీపంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేరుతుంది. కాబట్టి సకాలంలో అగ్నిమాపక శకటం అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి అవకాశం ఉంటుంది.