Share News

డిగ్రీకి వచ్చినా నేల చదువులే..

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:39 PM

అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలను రూ.12 కోట్లతో నిర్మించారు. అయితే బెంచీలు సమకూర్చకపోవడంతో విద్యార్థినులు తరగతి గదుల్లో నేలపైనే కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అత్యాధునిక వసతులతో ఈ కళాశాలను నిర్మించి విద్యార్థినులకు కనీసం బెంచీలు కూడా సమకూర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది.

డిగ్రీకి వచ్చినా నేల చదువులే..
బెంచీలు లేక నేలపై కూర్చొన్న విద్యార్థినులు

బెంచీలు లేక మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు కష్టాలు

ఫర్నిచర్‌కు రూ.50 లక్షలు కేటాయించిన పూర్తి స్థాయిలో సమకూర్చని వైనం

ప్రహరీ నిర్మించకపోవడంతో ఇబ్బందులు

అరకులోయ, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలను రూ.12 కోట్లతో నిర్మించారు. అయితే బెంచీలు సమకూర్చకపోవడంతో విద్యార్థినులు తరగతి గదుల్లో నేలపైనే కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అత్యాధునిక వసతులతో ఈ కళాశాలను నిర్మించి విద్యార్థినులకు కనీసం బెంచీలు కూడా సమకూర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రూసా నిధులతో మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అరకులోయకు కళాశాలను మంజూరు చేశారు. 2019 ఫిబ్రవరి 3న జమ్ము కశ్మీరులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో మహిళా కళాశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా అరకులోయలో కూడా ఆ రోజే పనులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో మహిళా డిగ్రీ కళాశాల భవనం, వసతి గృహం భవన నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణాలను పూర్తి చేశారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, వసతి గృహాన్ని ఆధునిక వసతులతో నిర్మించారు. అయితే ప్రహరీని మాత్రం నిర్మించలేదు. ఆరు నెలల క్రితం విద్యార్థినులను ఈ భవనాల్లోకి తరలించారు. అయితే ఫర్నిచర్‌కు రూ.50 లక్షలు కేటాయించినప్పటికీ విద్యార్థినులకు పూర్తి స్థాయిలో బెంచీలు ఏర్పాటు చేయలేదు. దీని వల్ల విద్యార్థినులు తరగతి గదుల్లో నేలపైనే కూర్చోవలసి వస్తోంది. దీంతో వారు అసౌకర్యానికి గురవుతున్నారు. మే 5 నుంచి విద్యార్థినులకు వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభంనాటికైనా కళాశాలకు ప్రహరీ నిర్మాణంతో పాటు తరగతి గదుల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:39 PM