జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 5,657 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యం
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:20 AM
జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచనున్నట్టు జిల్లా ఉద్యాన శాఖాధికారి జి.ప్రభాకరరావు తెలిపారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో జిల్లాలో ఖాళీగా ఉన్న 5,657 హెక్టార్లలో కొత్తగా ఉద్యాన పంటలను సాగు చేయించేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు.
అనువైన భూములు గుర్తింపు
గ్రామ సభల ద్వారా సాగుదారుల ఎంపిక
రాయితీపై మొక్కలు పంపిణీ
జిల్లాకు రూ.15కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఉద్యాన శాఖాధికారి జి.ప్రభాకరరావు
అనకాపల్లి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచనున్నట్టు జిల్లా ఉద్యాన శాఖాధికారి జి.ప్రభాకరరావు తెలిపారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో జిల్లాలో ఖాళీగా ఉన్న 5,657 హెక్టార్లలో కొత్తగా ఉద్యాన పంటలను సాగు చేయించేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. 2025-26 సంవత్సరంలో కన్వర్జెన్సీ మోడ్‌లో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. ఉద్యాన శాఖతో పాటు వ్యవసాయ, పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమ, డ్వామా, డీఆర్‌డీఏ శాఖల సమన్వయంతో ఉద్యాన పంటల సాగును పెంచనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం అమలులో ఉద్యాన, వ్యవసాయ, ఉపాధిహామీ పథకం అధికారులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 40 వేల హెక్టార్ల భూములు ఖాళీగా ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. ఉద్యాన పంటల సాగుకు అనుకూలమైన 5,657 హెక్టార్లలో ఈ ఏడాది పంటలు వేసేలా ప్రణాళిక అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. మే 15వ తేదీనాటికి ఆయా పంటల సాగు చేపట్టే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మామిడి, జీడిమామిడి, జామ, నిమ్మ, కొబ్బరి, ఆయిల్‌పామ్, సపోటా, సీతాఫలం, మునగ, పూల తోటల సాగుకు ఆసక్తి చూపే రైతులను గుర్తిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఆయా రైతులకు రాయితీపై మొక్కలను అందిస్తామన్నారు. ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులు గ్రామ సభలకు హాజరై తమ భూముల వివరాలను అందించి, పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి జి.ప్రభాకరరావు కోరారు.