పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:48 AM
‘పిల్లలను గొప్పగా చదివించాలి. చదివే అవకాశాన్ని తల్లిదండ్రులు కల్పించాలి.
మంత్రి నారా లోకేశ్ ప్రకటనతో విద్యార్థుల్లో ఆనందం
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుచేసే అవకాశం
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేత
నాలుగేళ్లు పీజీ కోర్సులకు దూరమైన వేలాది మంది
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
‘పిల్లలను గొప్పగా చదివించాలి. చదివే అవకాశాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకం కాకూడదు. ఆ ఉద్దేశంతోనే పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకువస్తున్నాం.’ విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ పీజీ కోర్సుల ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని పునరుద్ధరించే దిశగా చేసిన వ్యాఖ్యలు.
ఇంటర్‌లో టాప్ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులతో ఆయన ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది నిరుపేద ప్రతిభ కలిగిన విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో నిలిపివేత
గత వైసీపీ ప్రభుత్వం పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా నిలిపేసింది. దీంతో నిరుపేద వర్గాలకు చెందిన వేలాది మంది పీజీ కోర్సులు చేయలేని దుస్థితి ఏర్పడింది.
ఏటా ఐదు వేల మందికి మేలు..
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 50కు పైగా ప్రైవేటు పీజీ కాలేజీలు ఉన్నాయి. గతంలో ప్రైవేటు కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం పథకాన్ని వర్తింపచేసింది. వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సులు చేసే విద్యార్థులకు పథకాన్ని నిలిపేసింది. దీంతో ఆర్థికంగా మెరుగైన విద్యార్థులు మాత్రమే ప్రైవేటు కాలేజీల్లో చేరారు. గత ప్రభుత్వ నిర్ణయంతో అనేక పీజీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోయాయి. కూటమి ప్రభుత్వం మళ్లీ పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుకోవడంతో విద్యార్థులతోపాటు పీజీ కాలేజీ యాజమాన్యాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఏయూ పరిధిలోని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని కాలేజీల్లో సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు పీజీ చేసే అవకాశం లభించనుంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లు పోయినా కనీసం 3,500 మంది పీజీ కోర్సుల్లో చేరేందుకు వీలుంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వం పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కొద్దిరోజుల్లో ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.