Share News

సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల వెల్లువ

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:53 AM

వివిధ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలందించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల వెల్లువ

  • కత్తిమీద సాములా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ

  • ప్రజా ప్రతినిధుల ద్వారా ఒత్తిడి

  • తలలు పట్టుకుంటున్న అధికారులు

  • జూన్‌ 6 నాటికి గ్రౌండ్‌ చేయాలన్న ప్రభుత్వం

  • సిబిల్‌ స్కోరు తక్కువగా ఉన్న వారికి రుణాలు ఇవ్వలేమంటున్న బ్యాంకులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

వివిధ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలందించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆశావహులు భారీగా దరఖాస్తులు సమర్పించారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు కత్తిమీద సాములా మారింది. అంతేకాదు రుణాలు మంజూరయ్యేలా చూడాలంటూ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులకు వినతులు వెల్లువెత్తుతుండడంతో వారంతా తల పట్టుకుంటున్నారు.

బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సబ్సిడీతో కూడిన స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఈ ప్రక్రియను పూర్తిగా పక్కనపెట్టేయడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. జిల్లాలో బీసీ, ఈబీసీ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లకు 2,368 యూనిట్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ఇందుకోసం 18,984 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల తొలి విడతగా 400 మందికి అధికారులు రుణాలను మంజూరుచేశారు. రెండో దశలో మిగిలిన మొత్తం యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి, రుణాలు అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం విధించిన గడువులోగా గ్రౌండింగ్‌ చేయడం కష్టతరంగా మారిందని చెబుతున్నారు.

విపరీతమైన పోటీ

జిల్లాకు మంజూరుచేసిన యూనిట్ల మేరకు చూసుకుంటే ఒక్కో యూనిట్‌కు కనీసం నలుగురు నుంచి పది మంది వరకు పోటీ పడుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎంపీడీవోలు, జోనల్‌ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. వీరు స్థానిక నేతల ద్వారా అందిన జాబితాకే ప్రాధాన్యమిస్తారన్న ప్రచారం నేపథ్యంలో దరఖాస్తుదారులంతా నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలను ఇప్పటికే పూర్తిచేశారు. కానీ ఆయా వార్డులు/గ్రామాలకు కేటాయించిన యూనిట్ల జాబితాను అనేకచోట్ల ఫైనల్‌ చేయలేదు. అధికసంఖ్యలో దరఖాస్తులు రావడం, వారంతా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. కొన్ని చోట్ల నాయకులు ఫైనల్‌ జాబితాను అధికారులకు పంపారు. రుణాలకు ఎంపికైన వారితో జూన్‌ ఆరో తేదీ నాటికి యూనిట్లను గ్రౌండింగ్‌ చేయించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాకపోవడం సమస్యగా మారిందంటున్నారు.

విల్లింగ్‌కు బ్యాంకులు నో..

వివిధ ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తుండగా, 50 శాతం బ్యాంకు రుణంగా ఇస్తుంది. కానీ కొన్నిచోట్ల బ్యాంకులు రుణాలు అందించేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పాత రుణాలున్న వారికి, క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నవారికి రుణాలివ్వలేమని బ్యాంకు అధికారులు తేల్చి చెబుతున్నారు. యువత, రైతులు గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో చెల్లించలేదు. దీంతో క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయింది. ఇది తాజా సబ్సిడీ రుణాల మంజూరుకు అవరోధంగా మారిందంటున్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:53 AM