Share News

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:24 AM

సుమారు ఏడేళ్ల తరువాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

  • సుమారు ఏడేళ్ల తరువాత డీఎస్సీ నోటిఫికేషన్‌

  • అభ్యర్థుల్లో ఆనందం

  • మాట నిలబెట్టుకున్నారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రశంసలు

  • 2018లో చివరిసారిగా టీడీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్‌

  • మళ్లీ ఇప్పుడు...

  • ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భారీగా పోటీ

  • నిరుద్యోగ ఉపాధ్యాయులు సుమారు 35 వేల మంది ఉండవచ్చునని అంచనా

విశాఖపట్నం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):

సుమారు ఏడేళ్ల తరువాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ...ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తరువాత డీఎస్సీ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం తెరపైకి రావడంతో కాస్త జాప్యం జరిగింది. ఎట్టకేలకు 16,347 పోస్టులతో ఆదివారం నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయడంతో నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న తమకు మోక్షం కలిగిందని, భారీగా పోస్టులను ప్రకటించడం వల్ల ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం ఉందని రాజేష్‌ అనే అభ్యర్థి పేర్కొన్నాడు. గడిచిన ఎనిమిదేళ్ల నుంచి శిక్షణలోనే ఉన్నానని, నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూసి కళ్లు కాయలు కాశాయని, ఎట్టకేలకు తమ ఆకాంక్షలు నెరవేరే రోజు ఆసన్నమైందని ఆనందాన్ని వ్యక్తంచేశాడు. నిరుద్యోగుల ఇబ్బందులు, కష్టాలను గుర్తించిన ఏకైక సీఎం చంద్రబాబునాయుడు అని, గతంలో కూడా టీడీపీ ప్రభుత్వ హయాం (2018)లోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేశారని, మళ్లీ ఇప్పుడు ఆయన హయాంలోనే నోటిఫికేషన్‌ విడుదల చేశారని శాంతి అనే యువతి ఆనందాన్ని వ్యక్తంచేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడం ఆనందంగా ఉందంది. నోటిఫికేషన్‌కు, పరీక్షకు మధ్య కాల వ్యవధి కొంత తక్కువగా ఉందని, అయినప్పటికీ పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఆనందంగా ఉందని పాడేరు ప్రాంతానికి చెందిన కె.నవీన తెలిపారు. తమ ఇబ్బందులను ఈ ప్రభుత్వమైనా గుర్తించి నందుకు ఆనందంగా ఉందన్నారు. చదివిన చదువుకు అనుగుణమైన ఉద్యోగాన్ని సాధించలేక ఎన్నో కష్టాలు పడ్డామని, ఇప్పటికి తమ కల నెరవేరే రోజు వచ్చిందని సవర చిట్టెమ్మ అనే అభ్యర్థిని ఆనందాన్ని వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హడావిడిగా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చారని, అయినా అది ముందుకు సాగలేదని...ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా పోస్టుల సంఖ్యను పెంచి కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వడం ఆనందంగా ఉందని అరకులోయ ప్రాంతానికి చెందిన ఎం.బుజ్జిబాబు ఆనందాన్ని వ్యక్తంచేశారు. బీఈడీ పూర్తయి పదేళ్లు అవుతోందని, ఇప్పటివరకూ ఒకే ఒక్క డీఎస్సీ రాశానని, మరోసారి రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని రాజ్యలక్ష్మి అనే అభ్యర్థిని పేర్కొన్నారు. పరీక్షకు సమయం తక్కువగా ఉన్నా అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్‌ ఇవ్వడం ఆనందంగా ఉందని బి.సుధారాణి అనే అభ్యర్థిని తెలిపారు.

వేలాది మంది నిరుద్యోగులు

ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడే వారి సంఖ్య రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో అధికంగా ఉంది. చివరిసారిగా 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పటి నుంచి నోటిఫికేషన్‌ లేకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. ఉమ్మడి విశాఖ జల్లాలో ఉపాధ్యా పోస్టులకు పోటీపడుతున్నవారు సుమారు 35 వేల నుంచి 40 వేల మంది వరకూ ఉండవచ్చునంటున్నారు.

వేలాది మంది అభ్యర్థుల కల నెరవేరింది

- మామిడి శ్రీగౌరి, డీఎస్సీ అభ్యర్థిని

2015లో బీఈడీ పూర్తయింది. 2018లో తొలిసారి డీఎస్సీ రాశాను. అప్పటినుంచి...అంటే ఏడేళ్ల నుంచి నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా. ఇప్పటికైనా ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈసారి పోటీ గట్టిగా ఉంటుంది. అభ్యర్థులు భారీగా ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోస్టుల సంఖ్య మరికాస్త పెంచితే బాగుండేది. ఏదిఏమైనా నోటిఫికేషన్‌ రాకతో ఉపాధ్యాయ అభ్యర్థులు కల నెరవేరినట్టు అయింది.

ఆరేళ్ల నుంచి ప్రిపేరవుతున్నా

- కె.కాంతారావు, డీఎస్సీ అభ్యర్థి

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందా అని ఆరేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఇంటికి దూరంగా రూమ్‌లో ఉంటూ ప్రిపేరవుతున్నా. ప్రతినెలా కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎంతో నమ్మకంతో చదివిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిజం చేసేందుకు కష్టపడుతున్నా. ఈ తరుణంలో నోటిఫికేషన్‌ రావడం ఆనందంగా ఉంది. సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు.

Updated Date - Apr 22 , 2025 | 01:24 AM