Share News

తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌

ABN , Publish Date - Apr 20 , 2025 | 01:06 AM

ప్రపంచం ఐటీ దిగ్గజం గూగుల్‌ సంస్థ విశాఖపట్నం రాకకు మార్గం సుగమమైంది.

తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌

250 ఎకరాలు గుర్తింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రపంచం ఐటీ దిగ్గజం గూగుల్‌ సంస్థ విశాఖపట్నం రాకకు మార్గం సుగమమైంది. వారికి అవసరమైన భూమిని జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. జిల్లా కేంద్రం నుంచి 26 కి.మీ. దూరానున్న ఆనందపురం మండలం తర్లువాడలో 250 ఎకరాలు గుర్తించింది. ఇది ఆనందపురం మండల కేంద్రానికి మూడు కి.మీ., జాతీయ రహదారి-16కు 1.5 కి.మీ. దూరంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆహ్వానాన్ని అందిపుచ్చుకొని విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని 2024 డిసెంబరులోనే గూగుల్‌ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ గ్లోబల్‌ నెట్‌వర్కింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాశ్‌ కోలే విశాఖపట్నం వచ్చి అనువైన భూముల కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. సుమారుగా 80 ఎకరాలు అవసరం అవుతుందని జిల్లా అధికారులకు తెలిపారు. విశాఖ జిల్లా మొత్తం సిటీ కావడం ఒక్క భీమునిపట్నం నియోజకవర్గంలోనే గ్రామీణ ప్రాంతాలు, పెద్ద సంఖ్యలో భూములు ఉండడంతో అధికారులు వాటినే గూగుల్‌ ప్రతినిధులకు చూపించారు. అనేక చర్చలు అనంతరం తర్లువాడ భూములనే గూగుల్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇప్పటికే మధురవాడలో హిల్‌ నంబరు 4పై అదానీ డేటా సెంటర్‌ పనులు జరుగుతున్నాయని, తర్లువాడలో మరో డేటా సెంటర్‌ను గూగుల్‌ ఏర్పాటు చేస్తుందని, దీంతో విశాఖపట్నం పెద్ద డేటా సెంటర్‌గా మారనుందని గంటా వెల్లడించారు.

విశాఖలో సబ్‌మెరైన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్‌

డేటా సెంటర్‌ నిర్వహించాలంటే అత్యంత వేగవంతమైన ‘స్పీడ్‌ ఇంటర్నెట్‌’ అవసరం. దీనికి అవసరమైన కేబుల్‌ను ల్యాండ్‌ లైన్‌ ద్వారా కాకుండా సముద్ర గర్భం నుంచి తీసుకువస్తారు. దీనిని ‘సబ్‌మెరైన్‌ కేబుల్‌’గా వ్యవహరిస్తారు. సింగపూర్‌ నుంచి తీసుకువచ్చే ఈ లైన్‌కు విశాఖపట్నంలో ‘కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌’ (సీఎల్‌ఎస్‌) ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దేశంలో ఇలాంటి స్టేషన్లు ఇప్పటికే ముంబై, చెన్నై, కొచ్చిన్‌, టుటికోరిన్‌, త్రివేండ్రంలలో ఉన్నాయి. కొత్తగా విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వల్ల ఇక్కడ అదానీ, గూగుల్‌ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకువచ్చాయి.

Updated Date - Apr 20 , 2025 | 01:06 AM