Share News

పోడు వ్యవసాయంతో పర్యావరణానికి హాని

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:26 PM

పోడు వ్యవసాయం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని, దీని వలన వరదలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. జీకేవీధి మండలం చట్రాపల్లి, తోకరాయి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు.

పోడు వ్యవసాయంతో పర్యావరణానికి హాని
తోకరాయి గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

వరదలు, ప్రమాదాలు సంభవించే అవకాశం

ఎవరైనా కొనసాగిస్తే చర్యలు తీసుకోండి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

చట్రాపల్లి, తోకరాయి గ్రామాల్లో పర్యటన

సీలేరు, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): పోడు వ్యవసాయం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని, దీని వలన వరదలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. జీకేవీధి మండలం చట్రాపల్లి, తోకరాయి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. గత ఏడాది సెప్టెంబరు 8న సంభవించిన పెను తుఫాన్‌కు చట్రాపల్లి, తోకరాయి గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం, పంట నష్టాలు, చట్రాపల్లిలో సర్వం కోల్పోయిన బాధితులకు మోడల్‌ కాలనీ తదితర పరిహారాలు ఏ మేరకు బాధితులకు అందాయో అడిగి తెలుసుకున్నారు. గుమ్మిరేవుల పంచాయతీ తోకరాయి గ్రామంలో గ్రామసభ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తోకరాయి గ్రామంలో ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఎవరైనా పోడు వ్యవసాయం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని జీకేవీధి తహసీల్దార్‌ టి.రామకృష్ణను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం మాదిమళ్లు వంతెనను పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు, మండల ఇంజనీరింగ్‌ అధికారి జ్యోతిబాబు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:26 PM