Share News

హౌసింగ్‌ ఖాళీ!

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:25 AM

సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తన ప్రాభవాన్ని కోల్పోతోంది.

హౌసింగ్‌ ఖాళీ!

  • మూడు జిల్లాల్లోనూ అధికారులు, సిబ్బంది కొరత

  • డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు ఉండాల్సింది 15 మంది, ఉన్నది నలుగురే...

  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌లు ఉండాల్సింది 49 మంది... ఉన్నది తొమ్మిదిమందే

  • వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 60 మందికిగాను ఉన్నది నలుగురైదుగురు

  • కార్యాలయాల్లో మేనేజర్లు, అకౌంట్స్‌ అధికారులు, సూపరింటెండెంట్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు పోస్టులు చాలావరకూ ఖాళీ

  • అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో కాలక్షేపం

  • ఇళ్ల నిర్మాణంలో జాప్యం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి):

సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. చాలాకాలం నుంచి నియామకాలు లేకపోవడంతో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మూడు జిల్లాల పరిధిలో ప్రస్తుతం రెగ్యులర్‌ పోస్టులలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, నలుగురు డీఈలు, తొమ్మిది మంది ఏఈలు, నలుగురైదుగురు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లా కార్యాలయాల్లో రెగ్యులర్‌ సిబ్బంది వేళ్ల మీద లెక్క పెట్టేంత మందే ఉన్నారు.

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పోస్టుల్లో రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు నియమితులు కాగా అల్లూరి జిల్లా పీడీగా, ఈఈగా హౌసింగ్‌ డీఈ హోదా కలిగిన అధికారి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ, నర్సీపట్నం డివిజన్‌లకు మాత్రమే రెగ్యులర్‌ ఈఈలు కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది జూలై/ఆగస్టు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఇక పాడేరు, అనకాపల్లి, భీమిలి డివిజన్‌లలో ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు 15 మంది ఉండాలి. కానీ గాజువాక, పాడేరులో ఒక్కొక్కరు, అనకాపల్లి జిల్లాలో ఇద్దరు మాత్రమే మిగిలారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్‌ ఇంజనీర్‌లు 49 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం మూడు జిల్లాల్లో తొమ్మిది మాత్రమే మిగిలారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 60 మంది వరకూ రెగ్యులర్‌ విధానంలో పనిచేసేవారు ఉండాలి. ఇప్పుడు కేవలం నలుగురు నుంచి ఐదుగురు మాత్రమే మిగిలారు. అదేవిధంగా జిల్లా కార్యాలయాల్లో మేనేజర్లు, అకౌంట్స్‌ అధికారులు, సూపరింటెండెంట్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు పోస్టులలో చాలావరకూ ఖాళీగా ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. ఇంకా కార్యాలయాల్లో మరికొన్ని కేడర్లు, క్షేత్రస్థాయిలో ఏఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పలువురు పనిచేస్తున్నారు.

ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఒక్క విశాఖ జిల్లాలోనే 1.3 లక్షల ఇళ్లు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మరో 30 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి రెండు వేల ఇళ్లకు ఒక ఏఈ, పది వేల ఇళ్లకు డీఈ హోదా ఉండే అధికారి ఉండాలి. కానీ విశాఖ నగర శివారు ప్రాంతాల్లో 65 లేఅవుట్‌లలో 1.3 లక్షల ఇళ్లు మంజూరుకాగా తొలి విడతలో రమారమి లక్ష ఇళ్లు పనులు కొనసాగుతున్నాయి. నాలుగు గ్రామీణ మండలాలు, నగరంలో సొంత స్థలాల్లో మరో పది వేల ఇళ్ల వరకూ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇళ్ల నిర్మాణాల పురోగతిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ...జాప్యంపై అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. క్షేత్రస్థాయిలో లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణాల పురోగతి, నాణ్యతా పరిశీలించేందుకు అధికారులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల కొరత కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలి. దీనికితోడు ఉన్న కొద్దిమంది కూడా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్‌లు/వీడియో కాన్ఫరెన్స్‌లకు హాజరుకావాలి. వారాంతపు ప్రగతి నివేదికలు తయారుచేసి అధికారులకు పంపాలి. ఈ ఏడాది చివరికల్లా మరికొంతమంది రెగ్యులర్‌ అధికారులు, సిబ్బంది పదవీ విరమణ చేయనున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు రాబోయే రోజుల్లో భారీగా ఇళ్లు మంజూరుచేసే అవకాశం ఉంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే...రానున్న రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు పర్యవేక్షణ ఎలా అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలని వారంతా కోరుతున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 01:25 AM