Share News

ఎయిమ్స్‌ తరహాలో కేజీహెచ్‌

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:31 AM

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేజీహెచ్‌ను ఎయిమ్స్‌ తరహాలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.

ఎయిమ్స్‌ తరహాలో కేజీహెచ్‌

  • సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేస్తాం

  • పెద్దాస్పత్రిలో లెవెల్‌-2 క్యాన్సర్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.60 కోట్లు

  • అనకాపల్లిలో ‘నైపర్‌’ సెంటర్‌...50 ఎకరాలు కేటాయింపు

  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేజీహెచ్‌ను ఎయిమ్స్‌ తరహాలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు విరాళాలతో నిర్మించిన సెంటినరీ భవనాన్ని శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీగా గుర్తింపు పొందే సంస్థ ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటుంది. సదరు సంస్థకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్‌ పెరుగుతుంది) ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశామని, ఇరువురూ ఆ పనిలో ఉంటారన్నారు. అదేవిధంగా కేజీహెచ్‌లో లెవెల్‌-2 క్యాన్సర్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.60 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడే సెంటర్‌ ఫర్‌ కాంపిటెన్స్‌ ఇన్‌ సికిల్‌సెల్‌ డిసీజస్‌ ఏర్పాటవుతుందన్నారు.

అనకాపల్లిలో కేంద్ర ప్రభుత్వం సాయంతో నైపర్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) సెంటర్‌ ఏర్పాటుచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. అందుకు 50 ఎకరాలు కేటాయించామన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1923లో ఏర్పడిన ఆంధ్ర వైద్య కళాశాలలో ఎందరో మహామహులు చదువుకున్నారని, వారిలో కొందరి ఆలోచనలతో సెంటినరీ భవనం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరి అలవాట్లు మారి ఆరోగ్యం కాపాడుకునే విధంగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి తొలుత ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి స్వాగతం పలకగా, సెంటినరీ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ రవిరాజు భవనం నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలు, పూర్వవిద్యార్థుల విరాళాల గురించి వివరించారు. మొత్తం 1.4 ఎకరాల్లో రూ.50 కోట్లతో నిర్మించిన భవన సముదాయంలోని రెండు బ్లాక్‌లలో నాలుగు అంతస్థులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఈ భవనం కోసం గత ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ముందుచూపు ఉన్న చంద్రబాబునాయుడు నాయకత్వంలో విశాఖపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ తాను కళాశాల పూర్వ విద్యార్థి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేజీహెచ్‌ అభివృద్ధికి ప్రభుత్వం మరింత సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడును సెంటినరీ కమిటీ సత్కరించింది. హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్‌, బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎన్టీఆర్‌ వైద్య సేవా వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌, కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.చంద్రశేఖర్‌, డీఎంఈ నరసింహం, కమిటీ సభ్యులు డాక్టర్‌ శశిప్రభ, ఎస్కే అప్పారావు, పెదవీర్రాజు, వెంకటాచలం, టి.రాధ, దేవీమాధవి, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శివానంద, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక రాజధానిగా విశాఖ

గూగుల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి కంపెనీలు వస్తున్నాయి

రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న, అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతం విశాఖ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలో ఎక్కడ పదవీ విరమణ చేసినా నగరంలో స్థిరపడేందుకు ఇష్టపడుతుంటారన్నారు. అందుకే విశాఖను ఆర్థిక రాజధానిగా తయారుచేయాలని సంకల్పించామన్నారు. వచ్చే ఐదేళ్లలో విశాఖ ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి కంపెనీలు వస్తున్నాయన్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌ విశాఖలో ఏర్పాటవుతుందని, ప్రపంచంలో డేటా మొత్తం ఇక్కడే స్టోర్‌ చేస్తారని, దీంతో ఈ ప్రాంతం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 01:31 AM